బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో చోటుచేసుకున్న అపశృతి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ ఘటనపై స్పందించారు.
ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో చోటుచేసుకున్న అపశృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ దారుణ విషాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక, ఈ ఘటనపై ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఈ ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకరం. ఎండ వల్ల గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలాయి.
అందు వల్ల ఈ ప్రమాదం జరిగింది. గుడిసెకు, ఆత్మీయ సమ్మేళన వేదికకు 200 మీటర్ల దూరం ఉంది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఘటనకు, ఆత్మీయ సమ్మేళనానికి ఎలాంటి సంబంధం లేదు. బాధితులను ఆదుకుంటాం’’ అని హామీ ఇచ్చారు. కాగా, బుధవారం ఉదయం బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బుధవారం వైరా నియోజకవర్గంలోని చీమలపాడులో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్‌లు కార్యక్రమం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటున్న తరుణంలో పార్టీ కార్యకర్తలు స్వాగతం పలకటానికి పూనుకున్నారు. బాణ సంచాను పేల్చటం మొదలుపెట్టారు. ఈ సమయంలో ఓ తారాజువ్వ ఎగిరి పక్కనే ఉన్న గుడిసెపై పడింది. నిప్పు కారణంగా గడిసె అంటుకుంది. ఆ వెంటనే లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలాయి. పేలుడు కారణంగా ఇద్దరు వ్యక్తులు చనిపోగా దాదాపు 10 మందికి పైగా గాయపడ్డారు.