టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నపత్రాల కోసం కొందరు ఏకంగా పొలాలను సైతం తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. రేణుక, డాక్యానాయక్ దంపతులు ప్రవీణ్ కుమార్ కు రెండు దఫాలుగా రూ. 10 లక్షలు చెల్లించి ఏఈ ప్రశ్నపత్రాలను కొనుగోలు చేశారు. ఈ ప్రశ్నపత్రాలను మధ్యవర్తి రాజేశ్వర్ నాయక్ ద్వారా కె. నీలేష్ నాయక్, పి. గోపాల్ నాయక్ లకు డాక్యా నాయక్ రూ. 13.50 లక్షలకు అమ్మడు. మరో మధ్యవర్తి తిరుపతయ్య ద్వారా రాజేందర్ కుమార్ కు రూ. 5 లక్షలకు ప్రశ్నపత్రాలను అమ్మాడు. ప్రశాంత్ రెడ్డికి రూ. 7.50 లక్షలకు ప్రశ్నపత్రాలను విక్రయించాడు. అయితే నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, రాజేందర్ కుమార్ లు ప్రశ్నపత్రాల కోసం తమ గ్రామాల్లోని పొలాలను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. మేడ్చల్ ఠాణాలో కానిస్టేబుల్ గా పని చేసిన శ్రీనివాస్ నీలేష్ నాయక్, గోపాల్ నాయక్ లకు రూ. లక్ష ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ప్రశాంత్ రెడ్డి నగలు తనఖా పెట్టి కొంత డబ్బు, బయట అప్పు తెచ్చి మరి కొంత డబ్బు కలిపి మొత్తం రూ. 7.50 లక్షలకు ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, రాజేందర్ కుమార్, ప్రశాంత్ రెడ్డిలతో పాటు మరో 11 మందికి అసిస్టెంట్ ఇంజనీర్ ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు సిట్ పోలీసులు గుర్తించారు. వారి వివరాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఇక ప్రశ్నపత్రాల విక్రయాల్లో మహబూబ్ నగర్ జిలాకు చెందిన ఐదుగురి వ్యక్తులు కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సిట్ పోలీసులు గ్రూప్-1 రాసిన 20 మంది ఉద్యోగులను మరలా ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వందకు పైగా మార్కులు సాధించిన 84 మందిని విచారించగా.. వీరిలో ఎక్కువ మంది చాలా కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధమైనట్టు గుర్తించారు. కొందరు యూపీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించినట్టు వెల్లడించారు.
ఇక ఇప్పటివరకూ ఐదుగురికి గ్రూప్-1 ప్రశ్నాపత్రాలు, 15 మందికి ఏఈ ప్రశ్నపత్రాలు చేరినట్టు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. గ్రూప్-1 పరీక్షల్లో వందకు పైగా మార్కులు సాధించిన రమేష్, సురేష్, షమీమ్ లకు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డి ద్వారా ప్రశ్నపత్రాలు చేరినట్టు తొలిరోజు విచారణలో ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. రమేష్, షమీమ్ లకు ప్రవీణ్ కుమార్ ద్వారా, సురేష్ కు రాజశేఖర్ రెడ్డి ద్వారా ప్రశ్నపత్రాలు చేరినట్టు తెలుస్తోంది. కమిషన్ లో కింది స్థాయి ఉద్యోగులుగా ఉన్న వీరు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఈ అడ్డదారిని ఎంచుకున్నట్టు షమీమ్ వెల్లడించినట్టు సమాచారం. ఇక ఈ నిందితులను 5 రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతివ్వడంతో నిందితులను బుధవారం చంచల్ గూడ జైలు నుంచి హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి తరలించారు.