ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ఖమ్మం నగరానికి చెందిన హర్షవర్ధన్ అనే యువకుడు ఆస్ట్రేలియాలో మరణించిన సంగతి తెలిసిందే. తను చనిపోతున్నా అని తెలిసి తన మృతదేహాన్ని భారతదేశానికి తీసుకెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు తనే చేసుకున్నాడు. అంతేకాదు భార్యకు విడాకులు ఇచ్చి ఆమె కోసం ఎన్ని చేయాలో అన్నీ చేసి వెళ్ళిపోయాడు.
ఒక మనిషి ఎప్పుడు, ఎలా చనిపోతాడో తెలియదు. చావు ఏ రూపంలో, ఎలా వస్తుందో తెలియదు. ప్రతీ మనిషికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. కానీ ఆ ఎక్స్పైరీ డేట్ తెలిస్తే ఆ మనిషి పరిస్థితి ఎంత నరకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ రోజుల సమయమే ఉంటే ఆ బాధ వర్ణనాతీతం. ఆస్ట్రేలియాలో చనిపోయిన తెలుగు యువకుడు హర్షవర్ధన్ పరిస్థితి ఇదే. తనకు కావాల్సిన మనుషులకు, తననే నమ్ముకుని బతికే వారికి జవాబుదారీగా ఉండాలని చెప్పి ఆలోచించిన వ్యక్తి. అప్పటి వరకూ తన మీద ఆధారపడిన వారికి తన మరణంతో ఆధారం లేకుండా పోకూడదు కదా అన్న భయంతో.. అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లిపోయిన మంచి మనిషి.
ఆస్ట్రేలియాలో వైద్యుడిగా చేసే హర్షవర్ధన్.. క్యాన్సర్ కారణంగా ఇటీవల మృతి చెందాడు. అయితే తాను చనిపోతున్న విషయం రెండేళ్ల క్రితమే తెలిసింది. కాకపోతే పెళ్లయ్యాక తెలిసింది. భార్యను వీసా వచ్చిన తర్వాత ఆస్ట్రేలియా తీసుకెళదామని, భార్యకు మంచి జీవితాన్ని ఇవ్వాలని కలలు కన్నాడు. కానీ క్యాన్సర్ అతని కలలను చిదిమేసింది. ‘హర్ష నువ్వు త్వరలోనే చనిపోతావు, ఏమైనా పనులు ఉంటే వెంటనే చూసేసుకో’ అని యముడు ఎక్స్పైరీ డేట్ ఇచ్చేశాడు. మార్చి 24 హర్ష చనిపోయిన తేదీ. ఇంకొన్ని రోజుల్లో చనిపోతున్నాను కదా అని జీవితాన్ని ఎంజాయ్ చేయలేదు. తనను నమ్ముకుని ఒక ఇంటి నుంచి తన ఇంటికి వచ్చిన అమ్మాయి కోసం ఆలోచించాడు.
తన వల్ల ఒక అమ్మాయి జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందా అని కుమిలిపోయాడు. తను చనిపోతున్నా అని తెలిసి భార్యకు విడాకులు ఇచ్చేశాడు. విడాకులు ఇవ్వడమే కాకుండా ఆమెకు భరణానికి మించి ఇచ్చాడు. తను ఎలాగూ అనుభవించలేను.. కానీ తనను నమ్ముకుని వచ్చిన భార్య జీవితాన్ని నిలబెడుతుంది కదా అని సంపాదించిన డబ్బులో ఎక్కువ శాతం ఆమె కోసం కేటాయించాడు. ఆ డబ్బుతో ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. తను లేకపోయినా ధైర్యంగా జీవించేలా ఒక ఆర్థిక భరోసా ఇచ్చాడు. భార్యకు మాత్రమే కాదు, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా జీవితాంతం లోటు లేకుండా జీవించేలా ఏర్పాట్లు చేశాడు.
సాధారణంగా ఎవరైనా చనిపోతున్నా అంటే లోలోపల కుమిలిపోతారు. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తన వాళ్ళను, ప్రపంచాన్ని మర్చిపోతారు. కానీ హర్ష మాత్రం ధైర్యంగా నిలబడి తన వాళ్ళ కోసం ఆలోచించి అన్ని ఏర్పాట్లు చేసి వెళ్ళిపోయాడు. కనీసం ఏదో ఒక సమయంలో అయినా తను ఎలా బతకాలో ఆలోచిస్తారు. కానీ హర్ష మాత్రం తన జీవితం గురించి ఆలోచించడం మానేసి.. తన వాళ్ళ జీవితం గురించి ఆలోచించాడు. ఈ కొన్ని రోజుల్లో తను ఎలా బతకాలి అన్న దాని కంటే తనను నమ్ముకుని వచ్చిన భార్య, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎలా బతకాలో అని ఆలోచించాడు. ఇంత మంచి మనిషికా చావు వచ్చింది. నిజంగా ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. చనిపోతున్నా అని తెలిసి హర్ష తన భార్యకు విడాకులు ఇచ్చి.. ఆమె జీవితాన్ని సెటిల్ చేసి.. కొత్త జీవితాన్ని ఇవ్వడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.