కొడుకుకి జ్వరం అని తెలిస్తేనే విలవిలలాడిపోయే తల్లిదండ్రులు క్యాన్సర్ అని తెలిస్తే చూస్తూ ఎలా ఉండగలరు. కొడుకు ఎంత దూరాన ఉన్నా సరే వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తారు. అలా ఖమ్మం యువకుడు అయిన హర్షవర్ధన్ తల్లిదండ్రులు కూడా తన కొడుకు కోసం ఆస్ట్రేలియా వెళ్లాలని అనుకున్నారు. కానీ కొడుకు అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే?
ఏపూరి హర్షవర్ధన్ ఖమ్మం నివాసి. వృత్తి రీత్యా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ జనరల్ మెడిసన్ లో డాక్టర్ గా వైద్య సేవలు అందించేవాడు. హర్షవర్ధన్ డాక్టర్ గా అక్కడ మంచి గుర్తింపు, పేరు తెచ్చుకున్నారు. ఒక అనాథ ఆశ్రమంలో వందకు పైగా ఉన్న అనాథలకు వైద్యం అందించేవాడు. వారి పట్ల ప్రేమగా ఉండేవాడు. హర్షకు అనాథలన్నా, వాళ్లకు హర్ష అన్న పిచ్చి ప్రేమ. అలా అందరితో సరదాగా, ప్రేమగా కలిసిపోయే వ్యక్తి. అందరినీ కలుపుకుంటూ జీవించే వ్యక్తి హర్ష. అలాంటి హర్ష ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా అందరికీ దూరంగా వెళ్ళిపోయాడు. అయితే చనిపోయే ముందు తల్లిదండ్రులతో, బంధువులతో మాట్లాడాడు.
మొదటిసారి క్యాన్సర్ అని తెలిసి హర్షను చూసేందుకు ఆస్ట్రేలియా వెళదామని తల్లిదండ్రులు అనుకున్నారు. లేదా హర్ష ఇండియా రావాలని అనుకున్నాడు. కానీ అది కరోనా సమయం. లాక్ డౌన్ కారణంగా విమానాలు తిరగలేదు. అటు హర్ష రావడానికి లేదు. ఇటు కుటుంబ సభ్యులు వెళ్ళడానికి లేదు. అప్పటికి క్యాన్సర్ తొలి దశలో ఉంది. కొన్నాళ్ళు చికిత్స చేయించుకున్నాక క్యాన్సర్ తగ్గిందని అన్నారు. ఆ తర్వాత ఇండియా వచ్చి 15 రోజులు కుటుంబ సభ్యులతో గడిపి వెళ్ళాడు. మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళాక క్యాన్సర్ వచ్చింది. ఈసారి క్యాన్సర్ మహమ్మారి ప్రభావం హర్షపై దారుణమైన ఫలితాలను ఇచ్చింది.
నాన్న నిన్ను చూడ్డానికి ఆస్ట్రేలియా వస్తామురా అని అమ్మ, నాన్న అంటే వద్దు, మీరు రావద్దు అని అన్నాడు. తల్లిదండ్రులు అడిగారు. కానీ హర్ష మాత్రం అందుకు ఒప్పుకోలేదు. వాళ్ళు వస్తే తన పరిస్థితిని చూసి తట్టుకోలేరని వద్దన్నాడు. ఎందుకంటే మన అనుకున్న మనిషి కళ్ళ ముందు పోతుంటే తట్టుకునే శక్తి ఎవరికీ ఉండదు. ఇక జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే చూసి తట్టుకోలేరు. అందుకే వారిని చూసేందుకు రానివ్వలేదు. చావు చివరి క్షణాల్లో తనే ఒంటరిగా ఉన్నాడు. క్యాన్సర్ వల్ల తను పడే బాధలు చూడకూడదనే వారిని రావద్దని అన్నాడు. ఒకసారి తన స్నేహితులతో కలిసి కాఫీ తాగడానికి వెళదామని అడిగాడు. దానికి వారు ఇప్పుడే కదా తాగావ్, మళ్లీనా, మేము రాము అని అనడంతో హర్ష ఒక్కడే కాఫీ తాగడానికి వెళ్ళాడు. ఆ తర్వాత మూత్ర విసర్జనకు వాష్ రూమ్ కి వెళ్తే మూత్రం బదులు రక్తం వచ్చింది.
అప్పుడే స్నేహితులకు కాల్ చేసి.. రేయ్ నేను ఇంకో గంట కంటే ఎక్కువ సమయం బతకలేకపోవచ్చురా అని అన్నాడు. అంతే విరామం తీసుకుంటా అని చెప్పి పడుకుని 2 నిమిషాల తర్వాత శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా ఆ క్షణం భౌతికంగా హర్షతో మాట్లాడలేకపోయారు అతని తల్లిదండ్రులు. చివరిసారిగా హర్ష ముఖాన్ని బతికుండగా దగ్గర నుంచి చూడలేకపోయారు. అదే బాధపడుతున్నారు వారు. కానీ హర్ష తను పడే బాధలను వారు చూసి తట్టుకోలేరని.. గుండె పగిలి చనిపోయే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా రానివ్వలేదు. సహజంగా మృత్యువు సమీపించినప్పుడు మన అనుకున్న వారితో గడపాలి అని అనుకుంటారు. కానీ తల్లిదండ్రుల గురించి ఆలోచించి హర్ష ఒక నరకాన్ని అనుభవించాడు. దీనికి చాలా ధైర్యం కావాలి.