ఇటీవల చిన్న వయస్సుల్లోనే గుండె పోటుకు గురౌతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 40 కాదు కదా.. 20 ఏళ్లు నిండకుండానే తనువు చాలిస్తున్నారు. ఆకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ కు గురై మరణిస్తున్నారు. తాజాగా ఖమ్మంలో ఎంతో భవితవ్యం కలిగిన ఓ యువకుడు గుండె పోటుకు బలయ్యాడు.
ఎంతో భవిత్యవాన్ని చూడాల్సిన యువత.. అకాల మరణంతో తనువు చాలిస్తున్నారు. అప్పటి వరకు చలాకీగా తిరిగిన యువకులు.. కళ్లెదుటే గుండె పోటుతో చనిపోతున్నారు. ఒక్కసారిగా గుండె విపరీతంగా బాధపెడుతూ.. స్థబ్తుతగా మారి వారిని హరించేస్తోంది. చిన్న పిల్లలు కూడా గుండె పోటుతో మరణిస్తున్న వార్తలు తల్లిదండ్రుల్లో కలవర పాటుకు గురి చేస్తున్నాయి. గుండె బలహీనంగా మారిపోతుంది. కనీసం ఎటువంటి అనారోగ్య ఛాయలు కనిపించకుండానే హార్ట్ స్ట్రోక్‌కు గురౌతున్నారు. ఇటీవల తెలంగాణలో గుండె పోటుతో మరణిస్తోన్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. తాజాగా ఖమ్మంలో ఓ విద్యార్థి గుండె పోటుతో మృత్యువాత పడ్డారు.
ఖఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండల పరిధిలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన ఎస్.కె ఖాసీం పాషా(18) మంగళవారం సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. స్థానికులు చెప్పిన దాని ప్రకారం.. ఖాసీం పాషా ఖమ్మంలో తాతయ్య నవాబ్ బేగ్ దగ్గర ఉండి ఎస్ఆర్అండ్ బిజిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి చాతిలో నొప్పిరావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గ మధ్యంలోనే తనువు చాలించాడు. కార్పెంటర్ పనిచేసుకునే తండ్రి నాగుల్ మీరాకు ఇద్దరు కుమారులు. తల్లి మహబూబీ కూడా కూలీ పనులకు వెళుతూ పిల్లలను చదివిస్తున్నారు. చిన్న కుమారుడు మదర్ పాషా ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చేతికొచ్చిన కుమారుడు అకాల మృతి పట్ల తల్లిదండ్రులు నాగుల్ మీరా, మహబూబీ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో రేపల్లెవాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.