తన చావు ఎప్పుడు వస్తుందో ముందే తెలిసిపోయింది. కానీ భయపడలేదు. ఎవరినీ భయపెట్టలేదు. చనిపోయే చివరి రోజుల్లో కూడా తన వైద్య వృత్తిని కొనసాగించారు. వందకు పైగా వృద్ధులకు ఉచిత చికిత్స అందించారు. వారితో వైద్యుడిగా కాకుండా ఒక స్నేహితుడిగా మెలిగారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో చిరంజీవి రోగులతో ఎలా అయితే ఉన్నారో అలా ఈ హర్షవర్ధన్ వృద్ధులతో మెలిగారు. చనిపోయే ముందు రోజు ఐతే వారితోనే ఉన్నాడు. వాళ్ళని ఆరోజు..
తెలుగు రాష్ట్రాల్లో కంటతడి పెట్టిస్తున్న ఖమ్మం యువకుడి హర్షవర్ధన్.. మృత్యువుని జయించలేకున్నా కూడా అందరి మనస్సుల్లో మృత్యుంజయుడిగా జీవిస్తున్నాడు. తనకి వచ్చి ఊపిరితిత్తుల క్యాన్సర్ మహమ్మారి అయితే ఏం భయపడకండి, తగ్గిపోతుంది అని ఇంట్లో వాళ్లకి ధైర్యం చెప్పాడు. అసలు ఆ సమయంలో ఇంట్లో వాళ్ళు ధైర్యం చెప్పాలి, మోటివేట్ చేయాలి. కానీ ఇంట్లో వాళ్ళు కంగారుపడతారని ధైర్యం కూడగలుపుకుని తనను తాను మోటివేట్ చేసుకోవడమే గాక తన వాళ్ళని కూడా మోటివేట్ చేశాడు. చనిపోతున్నానని తెలిసి కూడా చనిపోయే ముందు తన వాళ్లకి ధైర్యం చెప్పాడు. తన వాళ్ళ కోసం ఆలోచించి వారు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకున్నాడు.
తన శవపేటికను తనే సిద్ధం చేసుకున్నాడు. మూడున్నర లక్షలు పెట్టి తన శవపేటికను ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకున్నాడు. తను చనిపోయాక తన మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి ఇండియా రావడానికి కావాల్సిన అనుమతులు తీసుకుని.. 15 లక్షల వరకూ ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేసుకున్నాడు. తను చనిపోయాక మృతదేహాన్ని ఇండియా తరలించడానికి తన స్నేహితులు ఇబ్బంది పడకుండా తనే స్వయంగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టుకున్నాడు. తన చావు కంటే కూడా తన భార్య భవిష్యత్తు పెద్దదని భావించిన హర్ష.. తన భార్యకు విడాకులతో పాటు డబ్బు ఇచ్చి ఆమె జీవితాన్ని సెటిల్ చేశాడు. యేపూరి హర్షవర్ధన్ ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ లో జనరల్ మెడిసన్ లో డాక్టర్ గా వైద్యసేవలు అందించారు.
చనిపోతున్న చివరి రోజుల్లో కూడా ఓల్డేజ్ నర్సింగ్ హోమ్ లో వృద్ధులకు ఉచితంగా వైద్యం అందించేవాడు. ఏరోజూ కూడా సెలవు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో సెలవు పెడితే వేరే వైద్యుడు వెళ్లేవారు. అయితే ఓల్డేజ్ నర్సింగ్ హోమ్ లో ఉన్న వారు హర్ష వచ్చి వైద్యం చేస్తేనే హ్యాపీగా ఫీలయ్యేవారట. హర్ష వచ్చి చికిత్స అందిస్తేనే వారికి తృప్తి ఉండేదని.. వేరే డాక్టర్ వచ్చినా తృప్తి ఉండేది కాదని హర్ష తండ్రి వెల్లడించారు. హర్షనే మాకు కావాలి అని పట్టుబట్టేవారు. అంతలా వారి ప్రేమను సంపాదించుకున్న హర్ష.. తను చనిపోయాక వారు ఇండియా వచ్చి తనను చూడలేరని.. చనిపోయే ముందు రోజు వారితో చాలా సేపు సమయం గడిపాడని చెప్పారు. మరి చనిపోతాడని తెలిసి కూడా చివరి క్షణాల వరకూ వృద్ధులకు చికిత్స అందించిన డాక్టర్ హర్షపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.