ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం అంటే భయంతో వణికిపోయేవారు గతంలో. బిల్లు వేలల్లో అయినా అప్పో సోప్పో చేసి ప్రైవేటు ఆస్పత్రిలోనే చికిత్స పొందేవారు ఉన్నారు. కానీ కొంతమంది పేదలకు ప్రభుత్వాసుపత్రే దిక్కు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన వైద్యం అందుతోంది. ఈ విషయంపై సామాన్య జనాలకు అవగాహన కల్పించేందుకు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ స్వయంగా ప్రభుత్వ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చి ఎందరో ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. చాలా మంది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలు వైద్యం విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల వైపే మొగ్గు చూపుతారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన దాఖలాలు అరుదు. అలాంటి ఒక జిల్లాకు అదనపు కలెక్టర్ అయి, ఆమె భర్త ఒక ఏఎస్పీ అయినా కూడా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించడం నిజంగా విశేషం, అభినందిచదగిన విషయం.
ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ఒక ఐఎఎస్‌గా ఉండి సామాన్యులలాగా, ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి సేవలు పొందారు. ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత నమ్మకం, గౌరవం పెంచిన అదనపు కలెక్టర్ స్నేహలతను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రత్యేకంగా అభినందించారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మాతా, శిశు కేంద్రంలో స్నేహలతను పరామర్శించారు. అదనపు కలెక్టర్ స్నేహాలత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎఎస్పీ శబరీష్ భార్యభర్తలు.