ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ ముదిరాజ్ ఇకలేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. శనివారం తెల్లవారు జామున మృతి చెందారు. సుదర్శన్ ముదిరాజ్ మృతి చెందిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఛైర్మన్ గా ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఆయన మరణం పట్ల ఉత్సవ కమిటీ సంతాపం ప్రకటించింది. ఈరోజు పంజాగుట్ట స్మశాన వాటికలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్‌లో అత్యంత ఎత్తైన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం.. ఎప్పుడు గణేశ చతుర్థి వేడుకల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే ఎనలేని క్రేజ్ ఉంది. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు అంతటి పేరు రావడం వెనుక.. ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ ముదిరిరాజ్ కృషి ఎంతో ఉంది. బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో 1954లో ఖైరతాబాద్ లో తొలిసారి ఒక అడుగు వినాయకుడిని ఆయన ప్రతిష్టించారు. ఆ తర్వాత ఏటా ఒక్కో అడుగు పెంచుతూ ఖైరతాబాద్ వినాయకుడిని విభిన్నంగా రూపొందించేవారు. అలా 2014 నాటికి 60 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత పర్యావరణం నిబంధనలతో వినాయకుడి ఎత్తును పెంచడం ఆపేశారు. ఖైరతాబాద్లో ప్రతిఏటా ప్రతిష్ఠించే మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవ కమిటీ ఛైర్మన్ సుదర్శన్ మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.