వరకట్న దూరాచారం కారణంగా తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆడపిల్లలకు పెళ్లి చేయాల్సిన పరిస్థితి. నగదుతో పాటు బంగారం, ఇంటెండు సామాన్లు, భూములు, అంతే కాకుండా వాహనం రూపంలో కూడా అల్లుడికి చదివించుకోవాల్సిందే. వరకట్నాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టినా పాటించేవారు కరువయ్యారు.
దేశం సాంకేతికంగా ఎంత దూసుకుపోతున్నా ఇంకా ఆచారాల, కట్టుబాట్లను అనుసరిస్తూనే ఉన్నాం. అటువంటి వాటిలో వరకట్నం ఒకటి. ఆడపిల్ల దొరకడమే కష్టమౌతున్న ఈ రోజుల్లో కూడా వరకట్నాలను భారీగానే కోరుతున్నారు వరుడు, అతని కుటుంబ సభ్యులు. వరకట్న దూరాచారం కారణంగా తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆడపిల్లలకు పెళ్లి చేయాల్సిన పరిస్థితి. నగదుతో పాటు బంగారం, ఇంటెడు సామాన్లు, భూములు, అంతే కాకుండా వాహనం రూపంలో కూడా అల్లుడికి చదివించుకోవాల్సిందే. వరకట్నాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టినా పాటించేవారు కరువయ్యారు. మొన్న ఓ ఎమ్మెల్యేకు ఆ అనుభవం ఎదురైంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఎమ్మెల్యే రసమయి హాజరైన పెళ్లిలో కట్నం తగ్గిందని వరుడు తాళికట్టేందుకు ససేమీరా అంటే.. ఆయనే రూ. 50 వేలు ఎమ్మెల్యే ఇచ్చి పెళ్లి తంతును కానిచ్చారు.
అయితే ఈ వరకట్నాన్ని పూర్తిగా అంతమొందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. కేరళలో తరహాలోనే కట్నం తీసుకుంటే డిగ్రీ పట్టా రద్దు చేసే చట్టాన్ని తీసుకురావాలని సన్నాహాలు చేస్తోంది. మానవవనరుల కేంద్రంలో సీనియర్ ఫ్యాకల్టీగా ఉన్న శ్రీనివాస్ వరకట్న నిషేధంపై పూర్తి అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్ సానుకూలంగా స్పందన తెలిపింది. దీని విధి విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ అంశంపై ఉన్నతాధికారులతో సమావేశమై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. చదువుకోని వారు అలాగే డిగ్రీ కన్నా తక్కువ చదువుకున్నవారు.. కట్నం తీసుకుంటే వారికి డిగ్రీ పట్టా ఉండదు కనుక.. అటువంటి వారికి ఎటువంటి నిబంధనలు ఉంటాయో లేదో తెలియాల్సి ఉంది.