దేశవ్యాప్తంగా మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం హోలీ వేడుకలు విషాదాలను మిగిల్చాయి. వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది.
దేశవ్యాప్తంగా మంగళవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు ప్రజలు. అయితే కొన్ని చోట్ల మాత్రం హోలీ వేడుకలు విషాదాలను మిగిల్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని కరీంనగర్ జిల్లా అలుగునూర్ లో మానేరు వాగులో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చనిపోయిన పిల్లలకు పరిహారం కూడా ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతానికి చెందిన కొంత మంది వలస కూలీలు ఉపాధి కోసం కరీంనగర్ వచ్చారు. ఇక్కడే హౌసింగ్ బోర్డులో ఉంటూ కూలీ పనులకు వెళ్లేవారు. మంగళవారం హోలీ వేడుకల్లో పాల్గొన్న విరాంజనేయులు(16), సంతోష్(13), అనిల్(14)లు పక్కనే ఉన్న మానేరు రివర్ ఫ్రంట్ వాటర్ లో ఈతకు వెళ్లారు. అయితే నీటిలో ఈత కొడుతూ.. ప్రమాదవశాత్తు ముగ్గురు బాలురు మృతి చెందారు. ఒకేసారి ముగ్గురు పిల్లలు చనిపోవడంతో అక్కడి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ హృదయవిదారక ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు.
ఈ నేపథ్యంలో మృతి చెందిన ముగ్గురికి తలా రూ.3 లక్షల చొప్పున పరిహారం అందివ్వాలని మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి చేతుల మీదుగా రేపు బాధితులకు చెక్కులు అందజేయనున్నారు. ఇక బాధిత కుటుంబాలకు వ్యక్తిగతం మరో రెండు లక్షల రూపాయలను అందివ్వనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. అలాగే ఇలాంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.