నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం లకారం చెరువులో 54 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఎన్టీఆర్ విగ్రహం కృష్ణుడి రూపంలో ఉండటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి కరాటే కల్యాణి ఈ విషయంపై స్పందిస్తూ విగ్రహావిష్కరణ అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు.
మే 28న నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు అభిమానులు సన్నద్ధం అవుతున్నారు. అయితే ఖమ్మంలోని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు తానా సభ్యులు, కొందరు ఎన్నారైలు, పలువురు వ్యాపారవేత్తలు ఆర్థికంగా తోడ్పడ్డారు. ఈ విగ్రహాన్ని కృష్ణుడు రూపంలో తయారు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎన్టీఆర్ విగ్రహం ఇలా కృష్టుడి ఆకారంలో లేదని.. ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుందని భావించి తయారు చేశారు. అయితే ఇప్పుడు ఈ విగ్రహం ఏర్పాటుపై నటి కరాటే కల్యాణి ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరాలు తెలియజేస్తున్నాయి.
సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై తమకి ఎలాంటి అభ్యంతరం లేదని వారు చెబుతున్నారు. గొప్ప నటుడు, మహా నేత అయిన తారక రామారావు విగ్రహం ఏర్పాటు చేయడం తమకి కూడా ఎంతో ఆనందంగా ఉందన్నారు. కానీ, విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో తయారు చేయడంపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంపై కరాటే కల్యాణి తీవ్రంగా స్పందించారు. కేవలం ఓట్ల కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆరోపించారు. అసలు ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుడి రూపంలో తయారు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ ఎన్నో చిత్రాల్లో నటించారు, ఎన్నో గొప్ప పాత్రలతో మెప్పించారు. అలాగని అన్ని పాత్రలతో, అన్ని వేషాలతో విగ్రహాలు ఏర్పాటు చేస్తామా అంటూ ప్రశ్నించారు. ఆయన రాముడిగా, రావణాసురిడిగా, కృష్ణుడిగా, ఒక పోలీస్ గా, లాయర్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలకు జీవం పోశారు. మరి అన్ని విగ్రహాలు ఏర్పాటు చేయం కదా అంటూ చెప్పుకొచ్చారు. ఇలా కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం చూస్తే.. పిల్లలు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనుకుంటారంటూ వ్యాఖ్యానించారు. కచ్చితంగా ఆ విగ్రహ ఏర్పాటు ఆపాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే తాము విగ్రహావిష్కరణను అడ్డుకుంటామంటూ స్పష్టం చేశారు. మరి.. ఈ వివాదం నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆకారం మారుస్తారా? అలాగే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.