'జీవితం అంటే పోరాటం.. పోరాటంలో ఉంది జయం, ఎక్కు తొలిమెట్టు కొండని కొట్టు ఢీ కొట్టు..' అంటూ రజనీకాంత్ సినిమా ప్రేక్షకుల్లో ఎంత ఉత్తేజాన్ని నింపారో, కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ అదే స్టయిల్ లో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. పరీక్షల్లో తప్పినంత మాత్రాన అక్కడితో ఆగిపోకూడదని, అదే విజయానికి తొలి మెట్టు అని ఆయన విద్యార్థులకు సూచించారు.
ప్రస్తుత సమాజంలో యువత ప్రతి చిన్న విషయాలకు ఒత్తిడికి గురై బలవంతపు నిర్ణయాలు తీసుకుంటున్నారు. లవ్ లో ఫెయిలై కొందరు, ఫోన్ కొనివ్వలేదని, బైక్ కొనివ్వలేదని ఇంకొందరు తనువు చాలిస్తున్నారు. కన్న బిడ్డలపై గంపెడు ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతూ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల విడుదలైన పదోతరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని వారు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనిపై తాజాగా కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్ స్పందించారు. తాను కూడా సివిల్స్ మొదటిసారి రాసినపుడు ఫెయిలయ్యానని, కాని మళ్లీ ప్రయత్నించి ఐఎఎస్ సాధించానని తెలిపారు.
విద్యార్థులు పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తేనో, ఫెయిలైతేనో నిరుత్సాహపడకూడదని కలెక్టర్ జి.వి పాటిల్ సూచించారు. ఒక్కసారి ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఫెయిలైనట్లు కాదని వారు పేర్కొన్నారు. జీవితంలో ఎన్నో సువర్ణావకాశాలు వస్తాయని వాటిని అందిపుచ్చుకుని జీవితంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు. సమాజంలో మనకంటే ఎక్కువ బాధలున్నవారు కూడా ఉన్నారని వారితో పోల్చుకుంటే మనం పడే ఇబ్బందులు చాలా తక్కువేనని ఆయన తెలిపారు. అద్భుతమైన ఈ మానవ జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకోవద్దని కలెక్టర్ సూచించారు.
తాను కూడా జీవితంలో ఎత్తుపల్లాలు చూశానని, ఐఎఎస్ కు ప్రిపేర్ అయి యూపిఎస్సీ పరీక్షలు రాసినపుడు నేను కూడా మొదటి సారి ఫెయిలయ్యానని కలెక్టర్ తెలిపారు. రెండవసారి ప్రయత్నించి ఐఎఎస్ సాధించానని వెల్లడించారు. అలాగే విద్యార్థులు కూడా మార్కులు తక్కువగా వచ్చాయని, ఫెయిలయ్యామని నిరుత్సాహపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. మీ అభిరుచులకు తగ్గట్టుగా ఏరంగంలో అయితే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రంగాన్ని ఎంచుకుని రెట్టింపు ఉత్సాహంతో జీవితంలో ముందుకు వెళ్లాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఆయన చెప్పిన ఈ మాటలు విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపాయి. ఈ క్రమంలో ఆయనను పలువురు మెచ్చుకుంటున్నారు.