గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మునుగోడు ఉపఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఓ మినీ సార్వత్రిక సమరం అన్నట్లుగా ఈ మునుగోడు ఉపఎన్నిక జరిగింది. చివరకు ఆదివారం వెలువడిన ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మునుగోడులోకి కారు దూసుకెళ్లింది. అయితే బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ కి గట్టిపోటీనే ఇచ్చిన.. చివరకి ఓటమి పాలయ్యాడు. ఈ ఉపఎన్నికల్లో మొత్తం 47 మంది పోటీ చేశారు. వీరిలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు. తాను భారీ మోజార్జీతో గెలుస్తాని, లక్షకుపైగా ఓట్లు తనకే పడతాయని ఎన్నికల ముందు కేఏ పాల్ ఓ రేంజ్ లో ప్రచారం చేశారు. ఇక ఫలితాలు వెలువడిన తరువాత కేఏ పాల్ కు వచ్చిన ఓట్లు చూసి అందరు షాక్ అవుతున్నారు. ఆయన చెప్పిన మాటలకు వచ్చిన ఓట్లకు అందరు ఆశ్యర్యపోతున్నారు. ఇంతకి మునుగోడు ఉపఎన్నికల్లో కేఏ పాల్ కు వచ్చిన ఓట్లు ఎన్ని? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
మునుగోడు ఉపఎన్నిక ప్రక్రియ మొదలైనప్పటి నుంచి తనదైన శైలిలో కేఏ పాల్ వినూత్నంగా ప్రచారం చేసి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ఒక రోజు రైతు వేషంలో సైకిల్ తొక్కతూ, మరో రోజు గొర్రెల కాపరి వేషధారణతో ప్రజల వద్దకు వెళ్లేవారు. అంతే కాక పిల్లలతో కలిసి డ్యాన్స్ లో వేసి..గ్రామాల్లో తెగ సందడి చేశారు. ఇక పోలింగ్ రోజైన నవంబర్ 3న ఆయన చేసిన హడావుడి అంతాఇంతా కాదు. 100 పోలింగ్ కేంద్రాలను చుట్టేయాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ హడావుడి చేశారు. మీడియాతో మాట్లాడేందుకు కూడా సమయం లేదంటూ పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీస్తూ హల్ చల్ చేశారు. తన చేతి వేళ్లన్నింటికి ఉంగరాలను పెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద తిరిగారు. ఇంత చేసిన ఉత్కంఠంగా సాగిన మునుగోడు ఉపఎన్నికల్లో ఆయనకు కేవలం 805 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ప్రతి రౌండ్లోనూ రెండు అంకెల సంఖ్యకే పరిమితమయ్యారు. అత్యధికంగా 13వ రౌండ్ లో 86 ఓట్లు, అత్యుల్పంగా 15వ రౌండ్ లో 11 ఓట్లు ఆయన సాధించారు. నోటాకు 482 ఓట్లు వచ్చాయి. ఒక దశలో నోటాతో కేఏ పాల్ పోటీ పడుతున్నారా? అన్నట్లుగా కేఏ పాల్ కి ఓట్లు పడ్డాయి. ఇంత జరిగినా పాల్ మాత్రం..తన ఓటమిని అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వీవీప్యాట్ లోని స్లిప్పులు లెక్కిస్తే తనకు లక్ష ఓట్లు వస్తాయని ధీమ వ్యక్తం చేశారు. ఇది కేవలం అవినీతి ఎలక్షన్ అని, ప్రజాస్వామ్యం కూనీ అయిపోయిందని పాల్ తెలిపారు. ప్రధాన పార్టీలు వందల వేల కోట్లు పంచినారని, అయితే 20, 30 కోట్లు మాత్రమే సీజ్ చేశారని ఆయన అన్నారు. అయితే కేఏపాల్ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేసున్నారు.