నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలను 20న నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిపేందుకు రంగం సిద్ధమైంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. జూ. ఎన్టీఆర్ తోపాటు పలువురికి ఆహ్వానాలు అందాయి.. అయితే..
తెలుగు సినిమా పరిశ్రమ నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలను 20న నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిపేందుకు రంగం సిద్ధమైంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులోని కైతలాపూర్ మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రత్యేక అతిథిగా ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరు కానున్నారు. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, సుమన్, మురళీ మోహన్, నందమూరి కళ్యాణ్ రామ్, రాఘవేంద్రరావు, అశ్వినీదత్ వంటి ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టిడి జనార్థన్.. సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూ ఎన్టీఆర్‌ను ఆహ్వానించిన సంగతి విదితమే. అయితే ఆయన ఈ వేడుకలకు గైర్హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఎన్టీఆర్ టీం ప్రకటన చేసింది. మే 20వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరు కావడం లేదని తెలిపేందుకు చింతిస్తున్నామని పేర్కొంది. అదే రోజున జూనియర్ ఎన్టీఆర్ 40వ జన్మదినోత్సవం జరుపుకోవడంతో పాటు అంతకుముందే కుటుంబ సభ్యులతో ప్రణాళిక చేసుకున్న కమిట్ మెంట్స్ వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని తెలిపింది. ఆహ్వాన సమయంలో ఆర్గనైజింగ్ కమిటీకి కూడా ఇదే విషయాన్ని తెలియజేశామని వెల్లడించింది.