పెద్దపల్లి జిల్లాలో శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే జనగామ జిల్లా కేంద్రంలో ఎస్సైగా సేవలు అందించిన శ్రీనివాస్.. మంచి పేరున్న పోలీస్ ఆఫీసర్ గా పేరు ప్రఖ్యాతలు పొందారు. అంతేకాకుండా ఎస్సై శ్రీనివాస్ తన కుమారుడికి పేదింటి అమ్మాయితో పెళ్లి ఘనంగా జరిపించి మంచి మనసును చాటుకున్నాడు.
పెద్దపల్లి జిల్లాలో శ్రీనివాస్ దంపతుల ఆత్మహత్య ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారిన విషయం తెలిసిందే. కొన్ని గంటల వ్యవధిలోనే తల్లిదండ్రుల ఒకరి తర్వాత ఒకరు మృతి చెందడంతో కుమారులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే? పెద్దపల్లి జిల్లా గోదావరఖని ప్రాంతంలో కాసర్ల శ్రీనివాస్-స్వరూప దంపతుల నివాసం ఉండేవారు. వీరికి భార్గవ్, రవితేజ సంతానం. శ్రీనివాస్ కు పోలీస్ ఉద్యోగం అంటే ఎంతో ఇష్టం. అందు కోసం బాగా కష్టపడి చదివి 1990లో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు.
దీంతో అప్పటి నుంచి శ్రీనివాస్ వివిధ హోదాల్లో పని చేస్తూ డిపార్ట్ మెంట్ లో మంచి పేరున్న పోలీస్ ఆఫీసర్ గా పేరు ప్రత్యేకలు సంపాదించుకున్నాడు. ఇతను చేసిన సేవలకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన ముంగిట వాలిపోయాయి. ప్రస్తుతం శ్రీనివాస్ జనగామ జిల్లా కేంద్రంలో ఎస్సైగా పని చేస్తుండేవాడు. అయితే గత మూడు నెలల కిందటే తన పెద్ద కుమారుడు రవితేజకు ఓ పేదింటి అమ్మాయితో ఘనంగా పెళ్లి జరిపించి తన మంచి మనసును చాటుకున్నారు. అలా పెళ్లైన కొంత కాలం పాటు శ్రీనివాస్ దంపతులు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇదిలా ఉంటే శ్రీనివాస్, స్వరూప దంపతులు ఇటీవల గొడవ పడినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా స్వరూప ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఇక భార్య మరణవార్త తెలుసుకున్న భర్త శ్రీనివాస్ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. స్వరూప తిరిగి రాదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక శ్రీనివాస్ గుండెలు పగిలేలా ఏడ్చారు. నా భార్య లేని బతుకు నాకు వద్ద అనుకున్నాడో ఏమో కానీ, స్వరూప ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటల్లోనే శ్రీనివాస్ తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంతో అతని కుమారులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మంచి పోలీస్ ఆఫీసర్ గా పేరు ప్రఖ్యాతలు పొందడంతో స్థానిక జనాలు అందరూ అతని కడసారి చూపు కోసం తరలి వచ్చారు. ఆయన మంచి తనం, సేవ చేసే గుణం, నలుగురితో నవ్వుతూ ఉండే శ్రీనివాస్ లేడు, ఇక తిరిగిరాడనే వార్త స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.