జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి బీఆర్ఎస్ పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఆమె తన రాజీనామా లేఖను మంత్రి కేటీఆర్ కు పంపారు.
జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ బోగ శ్రావణి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేసిన ఆమె, తాజాగా బీఆర్ఎస్ పార్టీకి, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. “చైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేశాక కూడా తనకు అధినాయకత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదని తెలిపారు. ప్రభుత్వ పెద్దలు.. కనీసం ఏం జరిగిందో అన్న విషయమై తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. దీంతో భారమైన హృదయంతో కౌన్సిలర్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు”.
“కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తాను ప్రజల మధ్యే ఉన్నానన్న శ్రావణి.. పార్టీ కోసం అహర్నిశలూ పని చేశానన్నారు. తాను గెలిచింది ప్రజల ఓట్లతోనే గానీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మద్దతుతో కాదని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులతో తాను టీఆర్ఎస్ పార్టీలో చేరానని.. కానీ స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు కవిత అనుచరుడిగా నటిస్తున్నాడని ఆరోపించారు. ఇన్ని రోజులపాటు తనకు సహకరించిన మంత్రి కేటీఆర్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను కేటీఆర్ కు పంపారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో సంజయ్ కుమార్ ఓటమికి తానే మొదటి కారణం అవుతానంటూ జగిత్యాల ఎమ్మెల్యేకి ఛాలెంజ్విసిరారు. ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని తన అనుచరులతో మాట్లాడి త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని తెలిపారు”.