ప్రతి రాజకీయ పార్టీలోను విబేధాలు, గొడవలు అనేవి సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో అవి శృతిమించినప్పుడు అధిష్టానం రంగంలోకి దిగి.. పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికి కొన్ని సందర్భాలలో వివాదాలు తారాస్థాయికి చేరుతాయి. కొందరు నేతలు అయితే ఏకంగా మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రం జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి బోగ శ్రావణి రాజీనామా చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వేధింపులకు గురిచేస్తున్నాడంటూ మీడియా ముందు కన్నీటి పర్యతం అయ్యారు.
బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన తనను అడుగడుగున ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ బీసీ మహిళ రాజకీయంగా ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యురాల్ని చేశారని శ్రావణి కన్నీటి పర్యతం అయ్యారు. తాను పేరుకే మున్సిపల్ ఛైర్మన్ నని.. అధికారమంతా ఎమ్మెల్యేనే చలాయించేవాడని శ్రావణి ఆరోపించారు. ప్రజల కోసం, పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తున్న తనను ఇబ్బందులకు గురిచేశారని ఆమె అన్నారు. తన ఇంట్లో నెలల బిడ్డ ఉన్నా కూడా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని, అలాంటి తనను ఎంతో వేధింపులకు గురి చేస్తున్నారని శ్రావణి తెలిపారు.
మున్సిపల్ ఛైర్మన్ గా ఉన్న మొదటి రోజు నుంచే తనను ఇబ్బందులకు గురి చేశాడని, అయినా ప్రజలకు సేవచేయాలనే ఉద్దేశ్యంతో భరిస్తూ వచ్చానని శ్రావణి అన్నారు. తాను నరక ప్రాయంగా మున్సిపల్ ఛైర్మన్ పదవిలో కొనసాగతున్నానని, నడిరోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, మంత్రి కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని సంజయ్ కుమార్ హెచ్చరించారించే వారని శ్రావణి అన్నారు. ఎమ్మెల్యే నుంచి తమకు ఆపద ఉందని శ్రావణి అన్నారు. అంతేకాక తన కుటుంబానికి ఏమైనా ప్రాణహాని జరిగితే అందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణమని శ్రావణి చెప్పారు. ఈ సందర్భంగా తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని శ్రావణి.. జిల్లా ఎస్పీని కోరారు. ప్రస్తుతం శ్రావణి కన్నీరు పెట్టుకుంటూ తన ఆవేదనను వ్యక్తం చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.