తెలంగాణలో తన రౌడీయిజం, సెటిల్ మెంట్స్ తో సామాన్యుల నుంచి పొలిటికల్ లీడర్స్ వరకు ఎవ్వరినీ వదల కుండా బెదిరించి దందాలు చేసిన నయీం ని పోలీసులు మట్టుపెట్టారు. తాను దందాలు చేసే సమయంలో నయీం కోట్ల ఆస్తిని అక్రమంగా దాచినట్టు వాటిని బయటపెట్టే పనిలో నిమగ్నమైంది ఐటీ శాఖ. ఈ క్రమంలో నయీం కి సంబంధించిన రూ.150 కోట్లు విలువ చేసే ఆస్తులను సీజ్ చేస్తూ ఐటీ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఆస్తులన్నీ నయీం ముందు జాగ్రత చర్యగా బినామీ పేర్ల మీద దాచాడు. ఆస్తులు సీజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన నోటీసుల నయీం భార్య హాసినికి ఇచ్చారు.
ఇప్పటికే నయీం కి సంబంధించిన 45 చోట్లు ఉన్న ఆస్తులను తాత్కాలికంగా సీజ్ చేశారు అధికారులు. ఇందులో నయీం బినామీగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్, వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటి విలువ సమారు 150 కోట్ల వరకు ఉండవొచ్చని అంచనా వేస్తున్నారు. 2016 షాద్ నగర్ వద్ద నయీం ని ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. తర్వాత ఆయన ఇంట్లో ఇతర చోట్ల పోలీసులు తనిఖీలు చేసిన సందర్భంగా వందల కోట్ల ఆస్తులు బయట పడ్డాయి. గతంలో నయీం పలువురు పోలీస్ అధికారులతో స్నేహ సంబంధాలు కొనసాగించి దందాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
పోలీస్ శాఖలో ఉన్నవారితో చేతులు కలిపి పలువురుని బెదిరించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని.. కొంత మంది రాజకీయ నేతలను కూడా బెదిరించేవాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దం కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే నయీం షాద్ నగర్ ఫామ్ హౌజ్ వద్ద ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అతన్ని ఎన్ కౌంటర్ చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు చేసిన తనిఖీలో కోట్ల ఆస్తులు బయట పడ్డాయి. అంతేకాదు అతని ఆస్తులు అమ్మేందుకు భార్య, అనుచులు సిద్దం కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నయీం ఆస్తులపై దర్యాప్తు ప్రక్రియను ఐటీ అధికారులు కొనసాగిస్తున్నారు.