రాజకీయం ఒక పద్మవ్యూహం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలం.. మిత్రులు శత్రువులుగా మారొచ్చు. శత్రువులు మిత్రుల్లా మెలగవచ్చు. కానీ.. ఏది జరిగినా దాని వెనుక సామన్య ప్రజలకు తెలియని, అర్థంకాని ఒక బలమైన కారణం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వచ్చిన కుదుపు వెనుక కూడా ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణాలపై తెలంగాణ రాజకీయ విశ్లేషకుల్లో, నేతల్లో.. సామన్య జనంలో సైతం ఒక చర్చ మాత్రం బలంగా జరుగుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై దాడి, అరెస్ట్‌తో తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిలపై సోమవారం వరంగల్‌లోని నర్సంపేటలో దాడి జరిగింది. కొంతమంది ఆమె బస్సుకు నిప్పు పెట్టి, రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడి టీఆర్‌ఎస్ కార్యకర్తలే చేశారని షర్మిల ఆరోపిస్తూ.. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె కారులో ఉండగానే.. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కారుతో సహా.. లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో తెలంగాణ రాజకీయం మొత్తం షర్మిల వైపు తిరిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. టీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉన్న రాజకీయం.. కొన్ని రోజులకు కమలం పార్టీ దూకుడుతో.. టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. ఇప్పటి వరకు తెలంగాణలో ఏ రాజకీయ అలజడి చెలరేగినా.. అది టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగానే ఉంది. కానీ.. ఒక్కసారిగా టీఆర్‌ఎస్ వర్సెస్ షర్మిలగా మారింది. ఈ మార్పు నిజంగానే షర్మిల ప్రాబల్యం పెరగటం వల్ల వచ్చిందా? లేక కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగంగా జరుగుతోందా? అనే విషయాలపై తెలంగాణ ప్రజానికంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
ఏడాది క్రితం పార్టీ పెట్టి, కొన్ని నెలలుగా పాదయాత్ర చేస్తున్నా.. షర్మిలను, ఆమె పార్టీని ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోని టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు.. ఇప్పుడు ఉన్నపళంగా ఆమెపై దాడి చేసి మరీ.. పాదయాత్రను అడ్డుకున్నారనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షర్మిల పెట్టుకున్న వైఎస్సార్ తెలంగాణ పార్టీపై సీఎం కేసీఆర్ ఏనాడు స్పందిచలేదు. అసలు కేసీఆర్ కానీ, టీఆర్‌ఎస్ కానీ.. ఆమెను ఒక రాజకీయ ప్రత్యర్థిగా భావించడంలేదనే భావన చాలా మందిలో ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్, కేటీఆర్‌లపై షర్మిల ఎన్ని ఆరోపణలు, వ్యాఖ్యలు చేసినా.. కేసీఆర్ స్పందించకపోవడమే అందుకు కారణం. ఎందుకంటే షర్మిల్ ఎంత ఎదిగినా.. ‘ఆంధ్ర’ అనే ఒక ముద్ర వేసి ఆమె నుంచి తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చడం కేసీఆర్‌కు పెద్ద విషయం కాదు. అందుకే షర్మిల పార్టీ విషయంలో కేసీఆర్ కాస్త చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భవించిన కొత్తలో తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ అంటూ.. టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య పోరు నడిచింది. ఆ తర్వాత.. చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ బలహీన పడింది. ఇదే అదునుగా భావించిన బీజేపీ.. తెలంగాణలో తన బలం పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు పోటీ ఇవ్వగలుగుతున్న పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీజేపీనే. దక్షిణ భారతదేశంలో తమ పార్టీని మరింత విస్తరించాలని భావిస్తున్న బీజేపీకి తెలంగాణలోని ప్రతిపక్ష శూన్యత ఎంతో కలిసొచ్చింది. అలాగే తెలంగాణతో పాటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న బీఆర్‌ఎస్‌గా మారిన టీఆర్‌ఎస్‌కు.. బీజేపీ కొరకరాని కొయ్యగా మారింది. దేశ స్థాయిలో సంగతి తర్వాత.. ముందు రాష్ట్రంలోనే టీఆర్‌ఎస్‌కు బీజేపీ పెద్ద తలనొప్పిగా మారింది. సంఖ్యలో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నా.. టీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటోంది మాత్రం బీజేపీనే.
కాంగ్రెస్‌ను బలహీన పర్చడంతో టీఆర్‌ఎస్ బలపడుతుందని భావించిన గులాబీ నేతలకు.. బీజేపీ ఎదుగుతుందనే సత్యం చాలా ఆలస్యంగా బోధపడింది. పరిస్థితి ఇలానే కొనసాగితే.. భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారడం ఖాయమని భావించిన బీఆర్‌ఎస్ అధినాయకత్వం.. షర్మిలను సెంట్రల్ చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమయంలో టీఆర్‌ఎస్‌కు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. ఎప్పుడైతే బీజేపీ బలమైన ప్రత్యర్థిగా మారుతూ వచ్చిందో.. అప్పటి నుంచి టీఆర్‌ఎస్ రాష్ట్ర స్థాయి దాటి పోరాడాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా జరిగే ప్రతి విషయంలో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్షంగా ఉంటే.. టీఆర్‌ఎస్‌కు ప్రధాని స్థాయి వ్యక్తితో, దేశాన్ని నడిపిస్తున్న పార్టీతో పోరాడాల్సి వస్తుంది. అందుకోసం జాతీయ పార్టీ లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు సైతం తీసుకునే పరిస్థితి తలెత్తుతోంది.
ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే కేసీఆర్ ముందున్న ఒకే ఒక దారి బీజేపీని సైడ్ చేసి తెలంగాణలో తమకు కొత్త శత్రువును సృష్టించుకోవడం. అందుకోసం కాంగ్రెస్‌ను బలపర్చే పరిస్థితి లేదు. ఒక వేళ కేసీఆర్ భావించినా.. కాంగ్రెస్‌లో ఉండే అంతర్గత కుమ్ములాటలతో.. వచ్చిన మైలేజ్‌ను కూడా పొగొట్టుకునే పార్టీలా మారింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ కేసీఆర్‌కు ప్రత్యమ్నయంగా కనిపించినట్లు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రధాన శత్రువు వైఎస్సార్ టీపీనే అనే భావన తెలంగాణ జనంలోకి తీవడంతో.. బీజేపీని బలహీన పర్చవచ్చనేది కేసీఆర్ వ్యూహంగా భావిస్తున్నారు. అధికార పక్షంలో అసమ్మతి నేతలు పార్టీ మారితే.. సహజంగానే తర్వాతి స్థానంలో ఉన్న పార్టీలోకి వెళ్తారు. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎవరు బయటికి వెళ్లినా.. బీజేపీనే ఫస్ట్ ఆప్షన్‌గా ఉండటం అందుకు ఉదాహరణ. ఈ రూట్‌ను మార్చేందుకే కేసీఆర్.. షర్మిలకు హైప్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. షర్మిల పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగినా.. ప్రస్తుతం బీజేపీతో పడుతున్నంత ఇబ్బంది ఉండకపోవచ్చు టీఆర్‌ఎస్‌కు. కానీ.. తాను ఎవరో ప్రయోగించిన బాణం కాదని.. షర్మిల అనేకసార్లు బల్లగుద్ది చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఉన్నపళంగా పుట్టిన ఈ రాజకీయ వేడి.. ఎవర్ని కాలుస్తుందో? ఎవరికి వెచ్చగా ఉంటుందో? చూడాలి.
#WATCH | YSRTP Chief YS Sharmila, who was detained from Somajiguda after she tried to go to Pragathi Bhavan to gherao Telangana CM’s residence, brought to SR Nagar Police station in Hyderabad pic.twitter.com/8mIVuDGN96
— ANI (@ANI) November 29, 2022
తెలంగాణ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ..ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. మేం పాదయాత్ర చేస్తుంటే..ఫలితం పెట్రోల్ తో దాడులు,పోలీసులతో అక్రమ అరెస్టులా?నిస్వార్థంగా 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తున్న ఒక మహిళకి మీరు ఇచ్చే బహుమతి ఇదా? దాడి చేపించడానికి KCRకు సిగ్గుండాలి.@TelanganaCMO
1/2 pic.twitter.com/7kITecNwF6— YS Sharmila (@realyssharmila) November 28, 2022