వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్ విశాఖ – న్యూఢిల్లీ రైలులో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. శుక్రవారం తెల్లవారుజామున రైలులోని ఎస్6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణీకులు ఉలిక్కిపడ్డారు. అప్రమత్తమైన లోకో పైలట్ వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వేస్టేషన్‌లో రైలును నిలిపివేసి అధికారులకు సమాచారమిచ్చారు. ఒక్కసారే బోగీలో మంటలు రావడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై స్టేషన్‌లో పరుగులు తీశారు. రైలు నిలిచిపోగానే ప్రయాణీకులు తమ లగేజీలను తీసుకుని కింది దిగిపోయారు.
ఇది చదవండి : మళ్లీ అధికారంలోకి బీజేపీనే.. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్
సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న టెక్నికల్ సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. ట్రైన్ బ్రేకులు జామ్ కావడంతోనే పొగలు వచ్చాయని, అంతకుమించి ఆందోళన చెందాల్సినదేమీ లేదని తేల్చి అధికారులకు సమాచారమిచ్చారు. ఈ ఘటనతో ప్రయాణీకులు సుమారు గంట పాటు నెక్కొండ రైల్వేస్టేషన్లోనే పడిగాపులు పడ్డారు. మొత్తానికి పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.