సాధారణంగా పిల్లలు అమ్మ, నాన్నల మధ్య పెరుగుతూ, వారి ప్రేమను పొందుతారు. కానీ కొంతమంది పిల్లలు.. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోరు. బంధువుల ఇళ్లల్లోనూ లేదా అనాథశ్రమాల్లోనూ పెరుగుతారు. ఇవన్నీ తెలిసి ఓ యువతి.. తన తమ్ముడి కోసం జీవితమే త్యజించింది. కాలంతో యుద్దమే చేసింది. చివరకు తమ్ముడిని ప్రయోజకుడిని చేసి..
అందమైన కుటుంబం అంటే తల్లిదండ్రులు.. వారి చిన్నారులు. పిల్లలు లేని ఇల్లు చూడలేన్నట్లే.. తల్లిదండ్రులు లేని పిల్లలు పరిస్థితిని ఊహించడం కష్టం. సాధారణంగా పిల్లలు అమ్మ, నాన్నల మధ్య పెరుగుతూ, వారి ప్రేమను పొందుతారు. కానీ కొంతమంది పిల్లలు.. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోరు. బంధువుల ఇళ్లల్లోనూ లేదా అనాథశ్రమాల్లోనూ పెరుగుతారు. ఇక్కడ తల్లిదండ్రుల నుండి లభించే ప్రేమ దొరుకుతుందా అంటే చెప్పడం కష్టం. ఇవన్నీ తెలిసి ఓ యువతి.. తన తమ్ముడి కోసం జీవితమే త్యజించింది. కాలంతో యుద్దమే చేసింది. చివరకు తమ్ముడిని ప్రయోజకుడిని చేసి.. తాను ఓ ఒడ్డుకు చేరింది. స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఈ అక్కాతమ్ముల్లదీ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా.
వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పుల్కర్ మండలం బస్వాపూర్‌కు చెందిన అక్కా తమ్ముళ్లు శ్రీలత, ప్రశాంత్. వీరు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయారు. ఒక చిన్న రేకుల ఇంట్లో ఉండి జీవనం సాగిస్తున్నారు. అక్కే అన్నీ అయ్యి తమ్ముడి బాధ్యతలు చేపడుతుంది. మిషన్ కుట్టుకుంటూ సోదరుడుని పోషిస్తోంది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తమ్ముడు చెడు సావాసాలు పడతాడని భావించి .. ఆ నిర్ణయాన్ని ఉపక్రమించింది. అయితే గతంలో దీనిపై ప్రముఖ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించగా పలువురు స్పందించారు. వారిలో సేవ్ దిగర్ల్ చైల్డ్, విన్నర్స్ ఫౌండేషన్ తో పాటు, సాప్ట్ వేర్ ఇంజనీర్ నందా మర్రి,ఇంకా ఆ ఊర్లో ఉండే తహసీల్దారు పరమేశ్ సహాయ సహకారాలు అందించారు. వాళ్లకి ఉండటానికి రూ. 5.30 లక్షలతో కొత్త ఇంటిని కట్టించారు. ఆమెకు రెండు కుట్టు మిషన్లు కూడా ఇచ్చారు.
అయితే కొన్ని నెలల క్రితం తమ్ముడు ప్రైవేటు ఉద్యోగంలో చేరాడు. మరోసారి పెద్దలు శ్రీలత వద్దకు పెళ్లి ప్రస్తావన తీసుకు రాగా అంగీకరించింది. ముద్దాయిపేటకు చెందిన కుమార్‌తో ఆమెకు శుక్రవారం వివాహం జరిగింది. బంధువులు ఘనంగా పెళ్లి జరిపించారు. సేవ్ దిగర్ల్ చైల్డ్ తరపున చంచల్ గూడ జైలు పర్యవేక్షకుడు నవాబ్ శివకుమార్ గౌడ్, డాక్టర్ చక్రపాణి కళింగ కృష్ణకుమార్, గ్రామీణాభివృద్ది సంస్థ జిల్లా అధికారి శ్రీనివాసరావులు రూ. లక్ష చెక్కును ఆమెకు అందజేశారు. హరిదాస్‌పూర్ కార్యదర్శి రోహిత్ కులకర్ణి రూ.30 వేల ఆభరణాలు కానుకగా ఇచ్చారు. తన ఇంటి నిర్మాణానికి సహాయం చేసి కీలక పాత్ర పోషించిన నందా మర్రి వాళ్ల కుటుంబీకులందరికి కొత్త దుస్తులు అందజేశారు.ఆ గ్రామంలో ఉండే స్థానిక యువకులు రూ15 వేలు సహాయం చేశారు. ఏ ఆదరణ లేకుండా తమ కష్టాన్నే నమ్ముకుని జీవించిన ఈ అక్కా తమ్ముళ్లు పలువురికి ఆదర్శులు అయ్యారు.