ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు లబ్దిదారులు. అన్ని తనిఖీలు అయ్యి చేతికి అందుతున్న సమయంలో ఉన్నతాధికారుల జాప్యం వారికి తలనొప్పులు తెచ్చి పెడుతుంది. అదే వృద్ధ దంపతుల విషయంలో జరిగింది. దీంతో వారేంచేశారంటే..?
ప్రభుత్వం నుండి అందాల్సిన పథకాలు, ఆర్థిక సాయం, ఇతర వ్యక్తిగత వ్యవహారాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. పని చేసి పెట్టాలంటూ అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేయాల్సిందే. అధికారులు దయ తలిస్తే లబ్దిదారులకు మేలు జరుగుతుంది. కానీ వారి జాప్యం కొన్ని సార్లు లబ్దిదారులను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా పింఛను పథకాల విషయంలో లబ్దిదారులు పలు మార్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేపు రా, మాపు రా అంటూ తిప్పుకుంటున్నారు. దీంతో విసిగి వేశారిపోతున్నారు లబ్ధిదారులు. ఫించను మంజూరైన.. పెన్షన్ రాకపోవడంతో విసిగిపోయిన తెలంగాణకు చెందిన ఓ వృద్ధ జంట.. వినూత్నంగా నిరసనను వ్యక్తం చేసింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు గొట్టెముక్కుల విజయ, రాములు. వీరిలో రాములుకు దివ్యాంగుల పింఛన్ వస్తోంది. విజయకు కూడా వృద్ధాప్య పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా.. పింఛను కార్డు మంజూరైంది. అయినా, ఇప్పటి వరకు ఆమెకు పెన్షన్ రావడం లేదు. పింఛను రావడం లేదంటూ ప్రజావాణిలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో భార్యా భర్తలిద్దరూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. విజయ గత దరఖాస్తు రసీదులను మెడలో మాలగా వేసుకొని భర్తతో కలిసి సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చి నిలబడ్డారు. ఇప్పటికైనా అధికారులు పింఛను మంజూరు చేయాలని వేడుకున్నారు. దీనిపై అధికారులు ఏం స్పందిస్తారో తెలియాల్సి ఉంది.