అసలే వచ్చేది వేసవి కాలం.. ఏసీలు, కూలర్లు లేకపోతే బతకడం కష్టం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. సాధారణంగానే వేసవిలో కరెంటు బిల్లు మోత మోగిపోతుంది. దానికి తోడు ప్రభుత్వం త్వరలోనే కరెంట్ ఛార్జీలు పెంచాలని నిర్ణయించుకుంది. దాంతో ఈ వేసవిలో సామాన్యులకు కరెంట్ బిల్లు చూస్తే షాక్ కొట్టే పరిస్థితి తలెత్తనుంది. ఆ వివరాలు..
ఇన్నాళ్లు చలికి గజ గజా ఒణికిపోయిన ప్రజలు.. ఇకపై ఉక్కపోతతో ఇబ్బంది పడనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాత్రి కాస్త చలి.. మధ్యాహ్నం అయితే చాలు ఎండలు మండుతున్నాయి. ఇక ఈ ఏడాది వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. దాంతో కూలర్లు, ఏసీల అమ్మకాలు పెరిగాయి. ఇక ఈ వేసవిలో కూలర్లు, ఏసీల చల్లదనంలో సేద దీరుదామనుకునే ప్రజలకు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్ నుంచి కరెంట్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతోంది. దాంతో ఈ వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల మోత మోగే అవకాశం ఉండనుంది. మరి ఈ బాదుడు ఎంత వరకు ఉండనుంది వంటి వివరాలు..
వేసవికాలంలో కరెంట్ బిల్లుల పెంపుతో ప్రజలకు షాకిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. కరెంట్ ఛార్జీలు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఫిబ్రవరి 12న దీనికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో ఓ గెజిట్ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు మోత మోగనున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈఆర్సీ చట్టంలో కొత్త నిబంధనను చేర్చింది. చట్టంలోని నిబంధనలకు మూడో సవరణ చేస్తూ కొత్త రెగ్యులేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం డిస్కంలకు.. ప్రతి మూడు నెలలకు ఓసారి విద్యుత్ కొనుగోలు ధర, నష్టాలకు తగ్గట్టు యూనిట్ మీద 30 పైసల చొప్పున ఎఫ్‌సీఏను వసూలు చేసుకునే స్వేచ్ఛను ఇచ్చింది సర్కారు. 30 పైసలకు మించి వసూలు చేయవద్దని కూడా సూచించింది.
అంతేకాక.. ఒకవేళ ఎఫ్‌సీఏ ఛార్జీలు తక్కువగా ఉన్నట్టయితే.. ఆ మొత్తాన్ని కరెంట్ బిల్లు నుంచి మినహాయించాలని ప్రభుత్వం నూతన చట్టంలో పేర్కొంది. ఎఫ్‌సీఏ వసూలుకు సంబంధించి వ్యవసాయా రంగానికి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. వ్యవసాయానికి ఇచ్చే ఎల్టీవీ విద్యుత్‌కు ఎఫ్‌సీఏ ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది. అందుకు సంబంధించిన ఛార్జీలను డిస్కంలు.. ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ గృహ, ఇతర అవసరాలకు వినియోగించే విద్యుత్ విషయానికి వస్తే బిల్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఎఫ్‌సీఏ ఛార్జీలను పక్కాగా సూచించాలని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాక పరిమితికి మించి వసూలు చేయాల్సి పరిస్థితి తలెత్తితే.. అప్పుడు మాత్రం కమిషన్ అనుమతి తీసుకోవాలని సూచించింది సర్కారు.
ప్రభుత్వ నిర్ణయం సామాన్యుల జేబుకు చిల్లు పడుతుందని ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగానే.. ఎండాకాలంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. ఏసీలు, కూలర్ల వాడకంతో విద్యుత్తు బిల్లులు భారీగా వస్తాయి. ఇది చాలదన్నట్లు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచితే.. ఇక ఈ వేసవిలో అటు ఎండ.. ఇటు కరెంట్ బిల్లుల మోతతో జనాలకు చుక్కలు కనిపించడం ఖాయం అంటున్నారు. మరి ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.