ప్రస్తుత రోజుల్లో అన్నింటి ధరలు చుక్కలను తాకుతుకున్నాయి. మరీ ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ వంటి వాటి రేట్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 100 రూపాయలు ఖర్చు చేసినా సరే.. లీటర్ పెట్రోల్ లభించడం కష్టం. మిగతా వాటితో పోలిస్లే పెట్రో ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్ ధర పెరిగితే.. చాలు ఆటోమెటిగ్గా.. మిగతా వాటి ధరలు కూడా పెరుగుతాయి. పెట్రో ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు.. 50 రూపాయల పెట్రోల్ ఫ్రీగా దొరుకుతుంది అంటే ఊరుకుంటారా.. బంకు దగ్గర క్యూ కట్టరు. ఇదే పరిస్థితి కనిపించింది ఓ చోట. వ్యాపారం పెంచుకోవడం కోసం ఓ బంకు యజమాని.. రూ. 50 పెట్రోల్ ఫ్రీ అని ఆఫర్ ప్రకటించాడు. ఇంకేముంది జనాలు ఎగబడ్డారు. అయితే ఈ ఆఫర్ తెలంగాణలోనే ఇచ్చాడు. ఆ వివరాలు..
జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ గ్రామంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ శ్రీ సాయిరాం ఫిల్లింగ్ స్టేషన్ యాజమాని బొమ్మ రమేష్ వాహనదారులకు ఈ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. రూ.50 పెట్రోల్ ఉచితమంటూ ప్రకటించాడు. ఆఫర్‌కు సంబంధించిన వివరాలను వాట్సప్ గ్రూపులో షేర్ చేశాడు. ఇంకేముంది.. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యూలేట్ అయ్యింది. వార్త తెలిసిన వెంటనే వాహనదారులు పెట్రోల్ బంక్ దగ్గరకు భారీగా చేరుకున్నారు. అయితే కేవలం ద్విచక్రవాహనాలకు మాత్రమ ఈ ఆఫర్‌ను ప్రకటించాడు రమేష్.
ఈ ఆఫర్ తెలుసుకుని ద్విచక్ర వాహనదారులు భారీగా రమేష్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకున్నారు. ఆఫర్ నేపథ్యంలో ఒక్క రోజులోనే ఉచితంగా 65 లీటర్ల పెట్రోల్ పంపిణీ చేసినట్లు పెట్రోల్ బంక్ యజమాని రమేష్ తెలిపాడు. రూ.50 పెట్రోల్ ఫ్రీ ఆఫర్ పెట్టడం ద్వారా పెట్రోల్ సేల్స్ కూడా బాగా పెరిగినట్లు వెల్లడించాడు. సాధారణంగా రోజూ 800 లీటర్ల పెట్రోల్ అమ్ముతున్నామని.. కానీ ఈ ఆఫర్ ప్రకటనతో.. పెట్రోల్ అమ్మకాలు అంతకంటే మూడింతలు పెరిగినట్లు తెలిపాడు. తాను ప్రకటించిన ఆఫర్ బాగా విజయవంతమైందని వెల్లడించాడు. అయితే ప్రస్తుతం ద్విచక్రవాహనాలకు మాత్రమే ఈ ఆఫర్ పెట్టామని, మరొసారి ఫోర్ వీలర్ వాహనాలకు కూడా ఇలాంటి ఆఫర్ ప్రకటిస్తానంటూ చెబుతున్నారు.
పెట్రోబ్ బంకుకు వచ్చిన వాహనదారుల నెంబర్లు నమోదు చేసుకుని వారికి ఫ్రీగా 50 రూపాయల పెట్రోల్ పంపిణీ చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ ఆఫర్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆఫర్ గురించి తెలుసుకున్న స్థానిక గ్రామాల ప్రజలు బంక్ వద్దకు భారీగా చేరుకున్నాడు. అయితే రోజులో కొద్ది సమయం మాత్రమే ఈ ఆఫర్ ఉంచారని.. అందుకే కొంతమందికి మాత్రమే ఈ ఆఫర్ ద్వారా రూ.50 పెట్రోల్ ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మరి బంపరాఫర్‌పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.