ఒక ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అతడు ఎందుకిలా చేశాడంటే..!
ఎంత పెద్ద చదువులు చదివినా, ఉన్నతోద్యాగాలు చేసినా కొందరిని అసంతృప్తి అనేది వేధిస్తూ ఉంటుంది. దీని వల్ల చేస్తున్న పనిలో ఆసక్తి ఉండదు. శ్రద్ధగా ఏ పనీ చేయలేం. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్న ఒక యువకుడు హాస్టల్లో నుంచి పారిపోయాడు. పదిరోజుల పాటు సీక్రెట్‌గా ఉంటూ కూలీ పనులు చేశాడు. అతడి జాడ కోసం వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు 12 గంటల వ్యవధిలోనే ఆ యువకుడ్ని గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక యువకుడు అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఒక ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 7వ తేదీన హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా అతడు వెళ్లిపోయాడు.
హాస్టల్‌కు తిరిగి రాకపోవడంతో నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎంత వెతికినా అతడి ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సునీల్‌కుమార్‌తో కలసి ఇన్స్పెక్టర్ స్వామి బృందం యువకుడి వివరాలను సేకరించారు. గతంలోనూ ఒకసారి ఇలాగే ఇంటి నుంచి వెళ్లి కూలీ పనులు చేసినట్లు వాళ్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మండలంలోని పండ్ల మార్కెట్లో యువకుడి కోసం వెతకడంతో దొరికాడు. అక్కడ హమాలీ పనులు చేస్తున్న యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు. పోలీసులకు యువకుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.