నేడు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులను వేరే ప్రాంతాల మీదుగా దారి మళ్లించనున్నారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకూ ఈ ఆంక్షలు విధిస్తారంటే?
ఏదైనా వేడుకలు గానీ రాజకీయ నాయకుల పర్యటనలు గానీ జరిగినప్పుడు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. వేడుకల్లో వందలాది మంది పాల్గొనడం లేదా రాజకీయ నేతల పర్యటనల వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ఈ క్రమంలో వేడుక గానీ రాజకీయ నేతల పర్యటన గానీ సాఫీగా సాగడం కోసం ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెడతారు ట్రాఫిక్ పోలీసులు. ఆ ప్రాంతాల మీదుగా వెళ్లే వాహనదారులను దారి మళ్లిస్తారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సహోదరులకు బుధవారం నాడు ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ విందులో సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొననున్నారు.
ఇఫ్తార్ విందు సందర్భంగా పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఎల్బీ స్టేడియంకు భారీగా ముస్లిం సోదరులు రానున్న క్రమంలో పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడనుంది. మరోవైపు సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు చేస్తున్నామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇఫ్తార్ విందు సందర్భంగా బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇఫ్తార్ విందు ఏర్పాటు, కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షల్లో భాగంగా వాహనాలను దారి మళ్ళిస్తున్నామని.. ప్రజలు సహకరించాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.