రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లోనూ భానుడి దెబ్బకు ప్రజలు బయటకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ రైళ్లలో రద్దీ పెరిగిపోయింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. భాగ్యనగరంలో ఎండలను తట్టుకోలేక ప్రయాణికులు మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. మెట్రోల్లో ఏసీ ఉంటుంది. కాబట్టి కూల్ కూల్‌గా ప్రయాణించేందుకు వాటిని ఎంచుకుంటున్నారు. దీంతో మెట్రోల్లో రద్దీ బాగా పెరిగింది. నగరంలోని ఏ మెట్రో స్టేషన్లో చూసినా కాలు పెట్టడానికి సందు లేని పరిస్థితి. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ ఎల్ అండ్ టీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని షార్ట్‌లూప్ ట్రిప్పులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఉదయం, సాయంత్రం నడిచే ఈ షార్ట్‌లూప్ ట్రిప్పుల వల్ల ప్రయాణికులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ప్రయాణికుల రద్దీని ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. అమీర్‌పేట్ నుంచి రాయదుర్గం వెళ్లాల్సిన రూట్లో ప్రయాణికులు ఇకపై నాగోల్ నుంచి వచ్చే రైళ్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఈ రూట్లో షార్ట్ ట్రిప్పులు ఉంటాయి. అమీర్‌పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల నుంచి షార్ట్ లూప్ ట్రైన్స్‌ను నడుపుతారు. నాన్ పీక్ అవర్స్‌లో ఇప్పటిదాకా ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి 7 నిమిషాలకు ఒక ట్రైన్ వచ్చేది. దానిని తాజాగా 4 నిమిషాల 30 సెకన్లకు తగ్గించారు. ఇక రద్దీని నియంత్రించడానికి అన్ని ప్రధాన స్టేషన్లలో మహిళా గార్డులతో సహా సిబ్బందిని పెంచారు.