హైదరాబాద్ మెట్రో ప్యాసింజర్లకు అలర్ట్. ఇటీవలే స్మార్ట్ కార్డులు, క్యూఆర్ టికెట్ల మీద డిస్కౌంట్లను ఎత్తేసిన మెట్రో.. ఇప్పుడు మరో బాదుడుకు సిద్ధమవుతోందని సమాచారం.
హైదరాబాద్‌లో మెట్రోకు ఎంత ఆదరణ ఉందో తెలిసిందే. రోజూ లక్షలాది మంది వీటిల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణ టిక్కెట్లపై ఇటీవలే డిస్కౌంట్ ఎత్తేసిన ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో.. ఇప్పుడు మరిన్ని కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మెట్రో పరిసరాల్లోని మాల్స్, మెట్రోకు కేటాయించిన పలు స్థలాల్లో ఇప్పటివరకు ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఇక నుంచి మాత్రం ఫ్రీ పార్కింగ్‌ను ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాహనాలపై పార్కింగ్ ఫీజును వసూలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మెట్రో షాపింగ్ మాల్స్ దగ్గర పార్కింగ్ ఫీజులకు సంబంధించిన బోర్డులను అధికారులు ఏర్పాటు చేశారు. ఎల్ అండ్ టీ సంస్థకు రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ)లో భాగంగా కొన్నిచోట్ల ప్రభుత్వం స్థలాలను కేటాయించింది.
వీటిల్లో మాదాపూర్, పంజాగుట్ట, ఎర్రమంజిల్, మూసారాంబాగ్ ఏరియాల్లో మాల్స్‌ను నిర్మించారు. అక్కడ ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వీటితో పాటు ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోల్లోనూ ఫ్రీ పార్కింగ్ సదుపాయాన్ని కల్పిస్తూ వస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో మెట్రో ఆరంభించిన తొలినాళ్లలో పార్కింగ్ రుసుమును వసూలు చేశారు. అయితే కరోనా తర్వాత ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఫీజు వసూలు చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుని.. ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని తీసుకొచ్చారు. ప్రయాణికులతో పాటు పార్కింగ్ చేసే వెహికిల్స్ సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుండటంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు మెట్రో రెడీ అవుతోంది.
మెట్రో స్టేషన్లలో 30 నిమిషాల లోపు వెహికిల్స్ నిలిపితే ఉచిత పార్కింగ్‌కు అనుమతించనున్నారు. అరగంట నుంచి గంట వరకు టూ వీలర్ అయితే రూ.10 వసూలు చేయనున్నారని సమాచారం. అదే ఫోర్ వీలర్ అయితే రూ.30 వసూలు చేయాలని భావిస్తున్నారు. గంట నుంచి 3 గంటలు వాహనాలను నిలిపితే టూ వీలర్‌కు రూ.15.. ఫోర్ వీలర్‌కు రూ.45, మూడు గంటల నుంచి 4 గంటల వరకు నిలిపితే ద్విచక్ర వాహనాలకు రూ.20, ఫోర్ వీలర్‌కు రూ.60 వసూలు చేయనున్నారని తెలుస్తోంది. నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం నిలిపిలితే టూ వీలర్‌కు రూ.25, ఫోర్ వీలర్‌కు రూ.75 వసూలు చేసేందుకు రెడీ అవుతున్నారు. పార్కింగ్ సమయం 12 గంటలు దాటితే టూ వీలర్‌కు రూ.75, ఫోర్ వీలర్‌కు రూ.150 వసూలు చేయాలని మెట్రో ఆఫీసర్స్ యోచిస్తున్నారు.