గ్రేటర్ హైదరాబాద్‌లో కలుషిత నీరు కలకలం సృష్టిస్తోంది. జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై ఇద్దరు మృతి చెందగా.. మరో పదిమందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి మొఘల్స్ కాలనీలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారు. నిన్న మొహ్మద్ ఖైసర్ అనే యువకుడు మరణించగా, నేడు ఆఫ్రీన్ సుల్తానా (22) మృతి చెందింది. ఆఫ్రీన్ సుల్తానా కూతురు ఫైజాబేగం(6నెలలు) పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆఫ్రీన్ సుల్తానాకు మూడు రోజులు ప్రయివేట్ హాస్పిటల్ లో, మూడురోజులు ఉస్మానియాలో చికిత్స అందించామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కలుషిత నీరు శాంపిల్ ను చూపిస్తూ ఈ నీళ్లు తాగే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అఫ్రీన్ విరోచనాలు, వాంతులతో బాధపడిందని, కాలనీలో ఇంటికొకరు అస్వస్థతకు గురైనవారేనని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో అజహరుద్దీన్ (15), సమ్రీన్ బేగం(35), ఆర్.పీ సింగ్ (42), షహజాది బేగం(30)లు, చిన్నారులు ఇత్తెషాముద్దీన్(2), ఇఖ్రాబేగం(2) అని సమాచారం. అయితే.. గత కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు చెప్తున్నారు. వేలకు వేలు బిల్లులు చెల్లిస్తున్నా మమ్మల్ని పట్టించుకోవట్లేరని వాపోతున్నారు.