ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీ చుట్టూ పరుగులు తీస్తోంది. ఒకప్పుడు మనుషులు యంత్రాలను నడిపిస్తే.. ఇప్పుడు యంత్రాలే మనుషులను నడిపించే పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఆధునిక కాలంలో వచ్చిన మరో అతిముఖ్యమైన మార్పు.. రోబో. మనుషులు చేసే అన్ని పనులను రోబోలు చకచకా చేసేస్తున్నాయి. మనం అంటే అలసిపోతాం.. కానీ రోబోలు యంత్రాలు కావడంతో.. వాటికి అలుపంటూ ఉండదు. రానున్న కాలమంతా రోబోలదేనని ఇప్పటికే టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం రోబోలను హోటల్, ఆస్పత్రుల వంటి చోట్ల వాడుతున్నారు. ఇక రోబోల వాడకం వల్ల మనుషులకు ఉపాధి తగ్గిపోతుందనే వాదనే ఇప్పటికే తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా రోబో సేవలను మరో రంగంలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు ప్రాంరభించారు. దీనికి హైదరాబాద్ వేదికగా మారింది. ఆ వివరాలు..
రోబోలతో పిల్లలకు పాఠాలు చెప్పించే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల. ఈ రోబో టీచర్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే.. పిల్లలు మాత్రం రోబో చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్నారు. హైదరాబాద్‌లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వెళ్తే క్లాసురూముల్లో రోబోలు పలకరిస్తాయి. పక్కన టీచర్ కూడా ఉంటారు. విద్యార్థులు అడిగే సందేహాలను రోబో తీరుస్తుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ) సాయంతో ఈ రోబోలు టీచర్‌గా మారాయి. దేశంలోనే తొలిసారిగా స్కూల్లో రోబో టీచర్‌ని ప్రవేశపెట్టామని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తెలిపింది. ఈగల్ రోబోల గురించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం వివరించడం గమనించాల్సిన విషయం.
హైదరాబాద్, బెంగళూరు, పుణెలో ఉన్న మూడు విద్యా కేంద్రాల్లోనూ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రోబోలను రంగంలోకి దింపింది. ఐదు నుంచి 11వ క్లాసులకు ఈ రోబోలు పాఠాలు కూడా చెబుతాయి. 30కు పైగా భాషల్లో పాఠాలు చెప్పగలవు ఈ రోబోలు. అంతేకాదు విద్యార్థులకు వచ్చే డౌట్స్‌ని కూడా చక్కగా క్లియర్ చేయగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్ టాప్‌ల నుంచి యాక్సెస్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ఇక ఈ రోబో టీచర్లను చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరి కొందరు మాత్రం.. ఇప్పుడు టీచర్ల పొట్టకొట్టే పని ప్రారంభించారా అంటూ విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.