ఇటీవల ఏటీఎస్ పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చిన హిజ్బ్ ఉత్ తహరీర్ ఉగ్ర సంస్థ కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ వివరాలు..
హైదరాబాద్ అడ్డాగా చేసుకుని ఐదేళ్ల నుంచి ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న హిజ్బ్ ఉత్ తహరీర్(హెచ్‌టీయూ) ప్లాన్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మత మార్పిళ్లు, బయో వార్.. అంటూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరంతా సామాన్యుల మాదిరి జనాలతో కలిసి పోయి.. పక్కా ప్లాన్‌తో తమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వీరి మీద స్థానికులకు, ఇక్కడి అధికారులకు ఎలాంటి అనుమానం రాలేదు. పొరుగు రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి.. వీరిని అరెస్ట్ చేయడంతో.. ఇనాళ్లుగా తమ చుట్టు.. ఇలాంటి వారు ఉన్నారా అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్-తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా.. హైదారాబాద్ కేంద్రంగా సాగుతున్న ఉగ్ర కుట్రలను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) టీమ్స్ వచ్చి అరెస్టులు చేసే వరకు వీరి ప్లాన్స్ గురించి ఎక్కడా ఎలాంటి మ్యాటర్ లీక్ కాలేదు అంటే ఎంగ పకడ్బందిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూపాల్, హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఇస్లామిక్ రాడికల్ రాకెట్‌ను బట్టబయలు చేశారు మధ్యప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు. ఈ కేసులో మొత్తం 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 11 మంది భూపాల్‌కు చెందిన వారు కాగా.. మరో ఆరుగురు హైదరాబాద్ వాసులు. ఈ మొత్తం ప్లాన్‌లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి పేరు యాసిర్. భూపాల్ కేంద్రంగా జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న యాసిర్.. నిషేధిత ఉగ్రవాద సంస్థతో సంబంధాలు పెట్టుకున్నాడు. దేశంలో విధ్వంసం సృష్టించే ప్లాన్‌లో భాగం అయ్యాడు. తనతో పాటు మరి కొందరిని ఇందులోకి లాగాలనుకున్న యాసిర్.. భూపాల్‌లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులను టార్గెట్ చేసి వారిని ఇస్లాం వైపు ఆకర్షితులను చేశాడు. అలా ఆకర్షితుడైన వాడే మహమ్మద్ సలీం అలియాస్ సౌరబ్ రాజ్ వైద్య.
2009 వరకు హిందువుగా ఉన్న సౌరబ్ రాజ్ వైద్య సడెన్‌గా ఇస్లాం వైపు ఆకర్షితుడయ్యాడు. తాను మతం మారడమే కాక.. తన భార్య మాన్సీని కూడా నెమ్మదిగా ఇస్లాం వైపు ఆకర్షితురాలని చేసి.. ఆమెను కూడా మతం మార్పించేశాడు. దాంతో మాన్సి అగర్వాల్ కాస్త రహీల సలీంగా మారిపోయింది. భూపాల్‌లో ఈ దంపతులకు ఉద్యోగం రాకపోవడంతో ఒక ఇస్లామిక్ స్కూల్లో పనిచేశాడు మహమ్మద్ సలీం అలియాస్ వైద్య. అక్కడ యాసిర్‌తో సలీంకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సలీం.. 2018లో హైదరాబాద్ రాగా.. ఓ బిజినెస్‌మ్యాన్ సూచనతో హైదరాబాద్‌లోని ఓ మెడికల్ కాలేజీలో మైక్రో బయాలజీ డిపార్ట్మెంట్కు హెచ్ఓడీగా ఎదిగాడు సలీం.
కాలేజీ ప్రొఫెసర్‌గా చలామణి అవుతోన్న సలీం.. మరోవైపు చాప కింద నీరులా తమ సామ్రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. దీనిలో భాగంగా తన ఇంట్లోనే సమావేశాలు నిర్వహించేవాడు. మహమ్మద్ సల్మాన్, జునైద్, హమీద్ , అబ్బాస్ అలీ వీళ్ళందరూ సలీం నిర్వహించిన సమావేశాలకు వచ్చినవారే. వీళ్లందరు మొదట తమకు టోలిచౌకిని తమకు అనువైన ప్రాంతంగా భావించారు. ప్రారంభంలో అక్కడే రహస్య సమావేశాలు నిర్వహించుకునేవారు. స్థానికులకు వీరిపై అనుమానం రావడంతో.. ఆ తర్వాత వీరి మకాం.. టోలిచౌకి నుంచి అటవీ ప్రాంతనికి మార్చారు. అక్కడే పలుసార్లు రహస్య సమావేశాలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
వీరి ముఖ్యమైన టాస్క్.. వీలైనంత ఎక్కువ మందిని మతం మారేలా చేయడం. ఆ తర్వాత మతం మారిన వారికి ప్రత్యేక క్లాస్‌లు తీసుకుని.. వారికి ఇస్లాం మీద నమ్మకం కలిగించడం.. ఇస్లాం కోసం ఏమైనా చేయగలిగేలా తయారు చేయడం నెక్స్ట్ టాస్క్. ఇక మూడో దశలో వీరికి.. కెమికల్స్, బయోలాజికల్, బ్యాక్టీరియల్ దాడులు చేయడంలో శిక్షణ ఇస్తారు. వీటికి సంబంధించిన ఆన్లైన్ సపోర్ట్ అంతా భూపాల్ నుండే వస్తుంది. వీటికి సంబంధించిన కార్యక్రమాలన్నింటిని.. భూపాల్ నుంచి యాశిర్.. హైదరాబాద్ నుండి సలీం చూసుకునే వారు. యువతను ఇస్లాం వైపు ఆకర్షితులను చేసి రాడికల్స్‌గా మార్చడమే వీళ్లపని. మతం మార్పిడి ప్రమోషన్ కోసం ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేసుకున్నారు నిందితులు. మతం మార్చుకున్న వారి ప్రసంగాలు, వీడియోలు ఇందులో ఉన్నాయి.
హైదరాబాద్ నుంచే ఈ మొత్తం శిక్షణ ఇచ్చినట్టు దర్యాప్తులో భయటపడింది. భాగ్య నగర శివారు ప్రాంతం అయిన వికారాబాద్ అడవుల్లో శిక్షణ ఇచ్చినట్ట సమాచారం. ప్రస్తుతానికి ఇమ్రాన్ ఇంటి సీసీ ఫుటేజ్ ను ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటికి ఎవరెవరు వచ్చిపోయారనే వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇమ్రాన్ ఇంట్లో మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్ ఇల్లు కేంద్రంగానే ఏమైనా కుట్రలకు పాల్పడ్డారా అనే కోణంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.