ఏ చిన్న జబ్బు వచ్చినా ప్రజలు ఆస్పత్రికి పరుగులు పెడతారు. కన్సల్టెన్సీ కావాలంటే వందలకు వందలు చెల్లించాల్సిందే. అది కూడా ఏ ఆన్‌లైన్లో పైపైన ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. కొందరు డాక్టర్లు సైతం కరోనా బాధితులను అంటరాని వారిగా చూస్తున్నారు. ఆ టెస్టులు, ఈ టెస్టులు అంటూ వేలకు వేలు వసలు చేస్తున్నారు. అలాంటిది, ఇలాంటి కరోనా కల్లోల సమయంలో ఓ వైద్యుడు కరోనా బాధితుల పాలిట దేవుడిలా మారాడు. 10 రూపాయలు పెడితే మంచి టీ అయినా దొరకని ఈ రోజుల్లో 10 రూపాయలకే కరోనా చికిత్స చేస్తూ అందరి అభిమానం చూరగొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పీర్జాదిగూడలో ఓ వైద్యుడు కేవలం 10 రూపాయలకే వైద్యం చేస్తున్నారు. నిరుపేదలు, రైతులు, స్వాతంత్ర్య సమరయోధులు, అనాథలు, యాసిడ్ బాధితులకు తక్కువ ఖర్చుకే చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ కష్టకాలంలోనూ తన సేవలు కొనసాగిస్తున్నారు – ప్రజ్వల క్లినిక్ డాక్టర్ విక్టర్ ఇమ్మాన్యుయేల్. నిరుపేదలకు రూ.10 చెల్లిస్తే చాలు వైద్యం చేస్తున్నారు. ఔషధాల్లో 10 శాతం రాయితీ, వైద్యపరీక్షల్లో 30శాతం రాయితీ ఇచ్చి అండగా నిలుస్తున్నారు.
నాడీ పట్టకుండానే రూ.500 నుంచి రూ. 1500 వరకు కన్సల్టేషన్ ఫీజు వసూలు చేసే ప్రైవేటు ఆసుపత్రులు ఉన్న ఈ రోజుల్లో ఇమ్మాన్యుయేల్ పది రూపాయలకే వైద్యం చేయడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా తన వద్దకు వచ్చేవారి నుంచి ఆయన రూ.200 ఫీజు తీసుకుంటారు. డబ్బులున్న వారి దగ్గర పూర్తి మొత్తం తీసుకుంటారు. కానీ నిరుపేదలకు అతితక్కువ ధరకే వైద్యం అందిస్తామని ఇమ్మాన్యుయేల్ తెలిపారు. దేశం కోసం సరిహద్దుల్లో పోరాడే సైనికులు, ప్రజలకు అన్నం పెట్టే రైతులు, అనాథలు, దివ్యాంగులకు ఫీజు, మందులు అంతా ఉచితంగా అందిస్తున్నారు. కొందరు దాతలు సహకరిస్తే నిరుపేద రోగులకు టెస్టులు సహా మందులూ ఉచితంగానే అందిస్తున్నారు. కొవిడ్ సోకిన నిరుపేద రోగులకు ల్యాబ్ పరీక్షలు, మందులు, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌లు తక్కువ ధరకే అందిస్తున్నారు. సాధారణ రోగులతో పాటు కొవిడ్ రోగులకు పది రూపాయలకే వైద్యం అందిస్తున్నారు. కరోనా మొదటిదశలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్‌సెంటర్‌లో సుమారు 400 మందికి పైగా చికిత్స చేసినట్టు ఇమ్మాన్యుయేల్ తెలిపారు. రెండోదశ ఉద్ధృతిలోనూ బాధితులకు చేయూతనందిస్తున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉండి, తీవ్రత ఎక్కువ ఉన్నవారికి ఇళ్ల వద్దకే సిబ్బందిని పంపించి చికిత్సనందిస్తున్నామని చెప్పారు. ఉచితంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పెడుతున్నామని వివరించారు.