పేకాట ఆడుతూ పట్టుబడుతున్న సంఘటనలు ఎప్పుడు జరిగేవే. కాకుంటే, ఈసారి పట్టుబడ్డ నాయకులు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన కీలక నేతలు. నలుగురు కలిసినపుడు మందు, విందు, పేకాట కామన్. అలా వీరందరూ ఒకచోట కలవడంతో కాసేపు సరదాగా గడుపుదామనుకున్నారు. కానీ, వారి ఆనందానికి పోలీసులు, మీడియా అడ్డుపడ్డారు. పేకాట ముక్కలు చేతుల్లో ఉండగానే ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, డిప్యూటీ మేయర్ సహ 6 కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మేడిపల్లి పరిధిలో చోటుచేసుకుంది.
మేడిపల్లి పర్వత్ నగర్ పరిధిలో కో-ఆప్ట్ సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి కార్యాలయంలో ప్రజాప్రతినిధులు పేకాట ఆడుతున్నట్లు రాచకొండ పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు ఆదివారం రాత్రి పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ విషయం తెలిసినా.. లోపల ఉన్న వ్యక్తులు కొద్దిసేపు తలుపు తెరవకుండా ఇబ్బందిపెట్టారు. దీంతో పోలీసులు బలవంతంగా లోపలికి చొచ్చుకుపోయి తలుపులు మూసివేశారు. అనంతరం డిప్యూటీ మేయర్ సహా ఏడుగురు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో పీర్జాదిగూడ కో-ఆప్ట్ సభ్యుడు జగదీశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్ మహేశ్, డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్ల భర్తలు నలుగురు మహేశ్, కృష్ణ, రఘుపతిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, కొందరు బిల్డర్లు ఉన్నట్లు సమాచారం.
అయితే, వీరిని తప్పించడానికి స్థానికనేతలు శతవిధాలా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. స్థానికంగా 3 గంటలపాటు కరెంటు తీసివేసి కాలనీలను అంధకారంలో ఉంచారు. కానీ, అప్పటికే పేకాట దృశ్యాలు మీడియాలో రావడంతో పోలీసు ఉన్నతాధికారులు వెంటనే కేసు నమోదు చేయాలని స్థానిక పోలీసులను ఆదేశించారని సమాచారం. ఘటనా స్థలంలో లిక్కర్బాటిల్స్, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్ స్పందించారు. తనపై కుట్రతోనే ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒక బీసీ నాయకుడు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక ఇలాంటి వాటిలో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మీడియాకు తెలిపారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ ప్రజాప్రతినిధులపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.