కొందరికి డబ్బులపై అత్యాశ ఉంటుంది. ఎంత సంపాదించినా వారికి సరిపోదు. అలాంటి వారి అత్యాశను సొమ్ము చేసుకుంటారు కేటుగాళ్లు. వారిని నమ్మించి మోసం చేస్తుంటారు. అలాంటి ఓ ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈమధ్య జరుగుతున్న కొన్ని మోసాల గురించి వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. ప్రజల నమ్మకాలు, అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు కొందరు. రైస్ పుల్లింగ్ యంత్రాలంటూ, బంగారాన్ని కనిపెట్టే వస్తువులంటూ జనాలను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు. ఈజీ మనీ కోసం ఆశపడే వారిని టార్గెట్ చేసుకుని రకరకాలుగా మోసం చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇలా మోసాలకు బలవుతున్న వారిలో గ్రామీణులు, నిరక్షరాస్యులతో పాటు ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. వీటిని చూస్తుంటే ఓ సినిమాలో హీరో అన్నట్లు ‘జనాలకు లాజిక్కులు అవసరం లేదు.. మ్యాజిక్కులే కావాలి’ అనేది కరెక్టే అనిపిస్తోంది.
మ్యాజిక్కులు నమ్మి.. దొంగ బాబాల చేతిలో నిండా మోసపోతున్నారు. అలాంటి ఓ ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. చెంబులో నుంచి డబ్బులు కురిపిస్తానంటూ నమ్మించి.. ఏకంగా రూ.21 లక్షలు నొక్కేశాడో కేటుగాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా, మిడ్జిల్ మండలంలోని మల్లాపూర్‌కు చెందిన వివేకానంద గౌడ్, రంగారెడ్డి జిల్లా వెల్జర్లకు చెందిన మహేశ్ కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. కాలం కలిసి రావడంతో వివేకానంద, మహేష్‌లు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగానే సంపాదించారు. అయినా వారికి డబ్బుపై ఆశ తీరలేదు. ఇంకా సంపాదించాలనే అత్యాశ వారిలో పుట్టింది. వీరికి ఏపీలోని నంద్యాల జిల్లాకు చెందిన రంగస్వామితో కొన్నాళ్ల కింద పరిచయం ఏర్పడింది.
రంగస్వామి మహా మోసగాడనే విషయం వివేకానంద, మహేష్‌లకు తెలియదు. అమాయకులను మోసం చేయడంలో ఆరితేరిన రంగస్వామి.. మహేశ్, వివేకానంద అత్యాశను ఆసరాగా చేసుకున్నాడు. తన దగ్గర పూజలు చేసిన చెంబు ఉందని, దాంట్లో నుంచి డబ్బులు కురుస్తాయని చెప్పాడు. అది మీకు ఇవ్వాలంటే కొంత డబ్బు తనకు ఇవ్వాల్సి ఉంటుందని వారితో అన్నాడు. అది నమ్మిన వివేకానంద, మహేష్‌లు దొంగబాబాకు విడతల వారీగా రూ. 21 లక్షలు సమర్పించుకున్నారు. ఆ తర్వాత చెంబు ఇవ్వకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.