‘వినాయకచవితి’ అనగానే భాగ్యనగరంలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. గణపతి నవరాత్రులు, ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన కార్యక్రమాలతో హడావుడి, కోలాహలం నెలకొంటుంది. ఈసారి ఆ జోష్ సగం తగ్గుతుందేమో మరి. ఈసారి నిమజ్జనానికి బుజ్జి గణపతికి ట్యాంక్‌బండ్‌పైకి అనుమతి లేదంటూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లో ప్రతిష్టించుకుని పూజలు చేసుకునే వారు నిమజ్జనానికి ట్యాంక్ బండ్‌కు రావొద్దని తెలిపారు.
ట్యాంక్ బండ్‌పై పోలీసులు చేస్తున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా అంజనీ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి పెద్ద విగ్రహాలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. త్వరగా నిమజ్జనం చేసేందుకు ఆటోమేటిక్ ఐడల్ రిలీజ్ సిస్టమ్‌ను వాడుతున్నట్లు తెలిపారు. ఈసారి క్రేన్‌ల సంఖ్యను తగ్గిస్తున్నట్లు చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై 16, ఎన్‌టీఆర్ మార్గ్‌లో 12, పీపుల్స్ ప్లాజాలో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరి, ఇలా చిన్న విగ్రహాలకు నో ఎంట్రీ అంటే.. నగర వాసులు ఇంట్లో పెట్టుకునే విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలని ప్రశ్నిస్తున్నారు.