హైదరాబాద్‌లో మరో భారీ నిర్మాణం రూపుదిద్దుకోనుంది. ఏంటా..? నిర్మాణం అనుకుంటున్నారా..? సామాన్య ప్రజలకు ఉచితంగా మల్టీ స్పెషాలిటీ వైద్యం అందించే అత్యాధునిక వైద్యశాల.
హైదరాబాద్‌లో మరో భారీ భవన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. 2000 పడకల సామర్థ్యంతో నిజాం ఇనిస్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) నూతన భవనాన్ని నిర్మించనున్నారు. గ్రేటర్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చే ఈ నూతన భవనానికి త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఆ వివరాలు..
నగరంలో జనాభా ప్రతి ఏటా అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కార్పొరేట్ వైద్యం పేదలకు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పేదలందరికీ ఉచితంగా మల్టీ స్పెషాలిటీ వైద్యం అందేలా చర్యలు చేపడుతోంది. అందుకోసం ప్రస్తుతం ఉన్న నిమ్స్ దవాఖాన విస్తరణకు అడుగులు వేసింది. ఈ విస్తరణ పనుల శంఖుస్థాపనకు త్వరలోనే సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు మంగళవారం నూతన సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో తొలిసారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
భవనం మొత్తం ఎనిమిది అంతస్తుల్లో ఉండనుండగా, మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, అత్యవసర సేవలు అందించేలా నిర్మించనున్నారు. ప్రస్తుతం నిమ్స్‌లో 1500 పడకలు ఉండగా, నూతన భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరనుంది. ఇక ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ కూడా పూర్తయితే మరో 200 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ఒక నిమ్స్‌లోనే 3,700 పడకలు ఉండనున్నాయి. ఇది నగర ప్రజలకు ఒక వరమనే చెప్పాలి. కరోనా వంటి మహమ్మారి ధరిచేరినప్పుడు.. సామాన్యుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బెడ్లు దొరక్క నానా ఇక్కట్లు పడ్డారు. అలాంటి కష్టాలకు చెక్ పెట్టడానికే ఈ ప్రయత్నం.
అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గాంధీలో ఏర్పాటు చేస్తున్న సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ పనులను మరింత వేగవంతం చేయాలని హరీష్ రావు స్థానిక అధికారులను ఆదేశించారు. అంతేకాదు నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగానే గాంధీలోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిపేలా చర్యలు తీసుకోవాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు సూచించారు. బ్రెయిన్ డెడ్ అయిన వారిని గుర్తించి.. వారి వారి బంధువులను ఒప్పించి అవయవ దానానికి ఒప్పించేలా చూడాలని గాంధీ ఆసుపత్రి సిబ్బందికి మంత్రి సూచించారు. నిమ్స్ నూతన భవనంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.