దేశ చరిత్రలో హైదరాబాద్ నిజాంల పాలనకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశంలో విలీనం అవ్వటానికి ముందు వరకు హైదరాబాద్ రాష్ట్రం బ్రిటీష్ సామ్రాజ్యంలో ఓ ధనిక రాష్ట్రంగా ఉండేది. ఏడో నిజాం ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడిగా పేరు పొందాడు. ఆయన దగ్గర అప్పటి బ్రిటీష్ రాణి కంటే ఎక్కువ సంపద ఉండేది. ఏడో నిజాం తర్వాత ఆయన మనవడు ఎనిమిదవ నిజాంగా ఉన్నారు. కానీ, అది కొంత కాలం మాత్రమే తర్వాత ఆయన భారత దేశాన్ని విడిచిపోయారు. తల్లిగారి దేశం అయిన ఇస్తాంబుల్‌లో స్థిరపడ్డారు. అక్కడే అద్దె ఇంట్లో చివరి శ్వాస విడిచారు. ఆయనే హైదరాబాద్ ఎనిమిదవ నిజాం, ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్.. ముకర్రమ్ ఝా.
ముకర్రమ్ ఝా 1933 అక్టోబర్ 6న ప్రిన్స్ అజం ఝా, ప్రిన్సెస్ దుర్రె షెహవార్ దంపతులకు జన్మించారు. దుర్రె షెహవార్ టర్కీ చివరి సుల్తాన్ కుమార్తె. ముకర్రమ్ ఝా జన్మించిన సమయానికి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలిస్తున్నారు. మనవడు ముకర్రమ్ అంటే ఏడవ నిజాంకు ఎంతో ఇష్టం. అందుకే తన కుమారుల్ని కాదని ముకర్రమ్ ఝాను 8వ నిజాంగా ప్రకటించారు. అయితే, 1971లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముకర్రమ్‌కు ఇబ్బందిగా మారింది. నలుగురు భార్యలు, విపరీతమైన వ్యసనాలతో ఆయన ఆర్థికంగా చాలా నష్టపోయారు. తర్వాత బంధువులతో ఆస్తి వివాదాలు నరకం చూపించాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ కుబేరుడు కాస్తా.. ఏమీ లేనివాడిగా మిగిలిపోయారు. దీంతో ఇస్తాంబుల్‌కు వెళ్లిపోయారు.
అక్కడే ఓ డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈ ఉదయం 89 ఏళ్ల వయసులో వయోభారం కారణంగా తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్‌లోనే జరగనున్నాయి. మంగళవారం ఆయన భౌతిక దేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. చౌమొహల్లా ప్యాలెస్‌లో ఉంచనున్నారు. ప్రజలు ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకోవటానికి వీలు కల్పించనున్నారు. తర్వాత అసఫ్ జాహీ సమాధులుండే ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరి, ప్రపంచ కుబేరుడి స్థానంనుంచి అద్దె ఇంట్లో మరణించిన హైదరాబాద్ 8వ నిజాం ముకర్రమ్ ఝాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.