తెలంగాణలో గత కొంత కాలంగా అధికార, ప్రతి పక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యతో తెలంగాణ అగ్గి రాజుకుంది. నిన్న తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. టీఆర్ఎస్ చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల గొడవలయ్యాయి. మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక జనగామ లో అయితే కర్రలతో దాడులు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణల్లో తొమ్మిది మంది బీజేపీ కార్యకర్తలకు తీవ్రంగ గాయాలయ్యాయి. వీరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేత మురళీధర్ రావు పరామర్శించారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు నిరసనగా జనగామలో గురువారం బీజేపీ మౌనదీక్షకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో బీజేపీ ముఖ్యనేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్ చేశారు. రాత్రి నుంచి బీజేపీ నేతల ఇంటి ముందు పోలీస్ పహారా కాస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది చదవండి: కచ్చా బాదం పాట వెనుక ఉన్న ఇన్స్పిరేషనల్ స్టోరీ!
ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని… నిరసనలు, బంద్‌లు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకీ మాత్రమే అనుమతిస్తారా అంటూ పోలీసులపై ఆయన మండిపడ్డారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే.. ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. ఇది ఎక్కువ కాలం చెల్లదని ఈటల హెచ్చరించారు.