మన జీవితంలో ఒక్కో దశ ఒక్కో మార్పును సంతరించుకుంటుంది. ఆ మార్పు ఓ కొత్త బంధాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. ఆ బంధం మనకు ఓ కొత్త బాధ్యతను, బరువును తెచ్చిపెడుతుంది. మనం చేసే పని ఏదైనా ఆ పనితో మన వాళ్ల జీవితాలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా పెళ్లయిన తర్వాత. భార్యాభర్తలుగా ఉన్నపుడు ఒకలాంటి బాధ్యతలు ఉంటే.. తల్లిదండ్రులుగా మారిన తర్వాత మరోలాంటి బాధ్యతలు ఏర్పడతాయి. ఆడ,మగగా వాళ్లు తీసుకునే నిర్ణయాలు బిడ్డల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. తల్లిదండ్రులుగా వారి గొడవలు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయి.
ప్రధానంగా చెప్పుకోవాలంటే సింగిల్ పేరంట్ వ్యవస్థ కారణంగా తల్లికో.. తండ్రికో దూరమైన చిన్నపిల్లలు కంటికి కనిపించని శత్రువుతో బయటకు కనిపించే యుద్ధం చేస్తున్నారు. తాజాగా, ఓ చిన్నారి తల్లిదండ్రులు విడిపోతుండటాన్ని తట్టుకోలేకపోయింది. కోర్టులో తనకు తల్లిదండ్రులు ఇద్దరూ కావాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దృశ్యం జడ్జినే కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళితే.. కల్వకుర్తిలోని మాడ్గుల గ్రామానికి చెందిన ఓ జంట విడాకుల కోసం లోక్ అదాలత్‌ను ఆశ్రయించింది. తాజాగా, ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ కోసం దంపతుల ఆరేళ్ల కూతురు కూడా వచ్చింది.
ఈ సందర్భంగా జడ్జి సీఎం రాజ్యలక్ష్మి పాపను ఓ ప్రశ్న వేసింది. ‘‘నువ్వు ఎవరి దగ్గర ఉంటావు?’’ అని అడిగింది. దానికి పాప ఎలాంటి తడబాటు లేకుండా ‘‘ నాకు అమ్మా, నాన్న ఇద్దరూ కావాలి’’ అని అంది. అమ్మానాన్నల కోసం వెక్కివెక్కి ఏడ్చింది. దీంతో జడ్జి సైతం కంటతడి పెట్టుకున్నారు. చిన్నారి మాటలకు చలించిపోయారు. భార్యాభర్తలు విడిపోతే వారి పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందన్న దానిపై జంటకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కలిసి ఉండాలని కోరటంతో పాటు.. విడాకుల గురించి ఆలోచించుకోవటానికి 15 రోజుల గడువు కూడా ఇచ్చారు.