గత కొద్ది రోజుల నుంచి మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. ఎండాకాలం కావటంతో ఎక్కువ సంఖ్యలో జనం మెట్రో రైళ్లలో ప్రయాణం చేయటానికి ఇష్టపడుతున్నారు.
వేసవికాలం ముగింపునకు వచ్చింది. అయినా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ప్రయాణం విషయంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. రోడ్లపై ప్రయాణం నిప్పల కొలిమిలో నడుస్తున్నట్లుగా ఉంది. అందుకే నగరవాసులు సొంత వాహనాలలో, ఆర్టీసీ బస్సులలో ప్రయాణానికి విముఖత చూపుతున్నారు. ఎక్కువగా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంటున్నాయి. రోజు రోజుకు మెట్రో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మెట్రో రైల్లో ఏసీ ఉండటం కూడా ఇందుకు కారణం. సాధారణంగా ప్రతిరోజు సుమారు 4.5 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా.. గురువారం 5 లక్షల మంది ప్రయాణికులు వివిధ మార్గాల్లో కాకపోకలు సాగించారని సమాచారం. కొద్దిరోజుల నుండి ఉదయం 8 గంటలనుండే మెట్రో రైళ్లు రద్దీగా కనిపిస్తున్నాయి.
ఐటీ ఉద్యోగులు, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న వారు కూడా సొంత వాహనాలను పక్కన పెట్టి చల్లగా మెట్రో రైల్ లో వస్తున్నారు. నగరంలో మొత్తం 3 కారిడార్లలో ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులు తిరుగుతున్నట్లు అదికారులు తెలిపారు. అయినా కానీ, ప్రయాణికులకు పడిగాములు తప్పలేదు. నాగోల్ నుంచి అమీర్ పేట్ వరకు, అక్కడి నుండి రాయదుర్గం వరకు ప్రముఖ స్టేషన్లలో ప్రయాణికులు కిక్కిరిసిపోతున్నారు. ప్రస్తుతం ప్రతి 3 నిమిషాల నుండి 6 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున నడుస్తున్నాయి. అలా నడిపిస్తున్నా.. జనం విపరీతంగా వెల్లువెత్తుతున్నారు. ట్రైన్ల వేగం పెంచి ప్రతి 3 నిమిషాలకు ఒక ట్రైన్ చొప్పున నడిపిస్తే ట్రిప్పులు పెరిగి తమకు కొంతమేరకు ఇబ్బందులు తప్పుతాయని ప్రయాణికులు కోరుతున్నారు. మరి, రోజురోజుకు పెరుగుతూ ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్యపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.