కని, పెంచి, ఓ మంచి భవిష్యత్తును ఇస్తున్న తల్లిదండ్రుల పట్ల కొంత మంది పిల్లలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలైన నేటి సమాజంలో తల్లిదండ్రులను కూడా డబ్బుల కోసం వేధిస్తూ, వారికి ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. కానీ తమ కోసం అహర్నిశలు కష్టపడిన తమ తల్లిదండ్రుల పట్ల వినూత్నమైన ప్రేమను ప్రదర్శించారు ఆ ముగ్గురు కుమారులు
దేవుడి తర్వాత మనం చేతులెత్తి మొక్కాల్సిందీ తల్లిదండ్రులకే. మనకు జన్మనిచ్చి, పెంచి పెద్ద చేసి, మంచి విద్యాబుద్ధులు నేర్పించి, ఓ మార్గంలో పెడతారు. ఆ తర్వాత పెళ్లిళ్లు చేసి, వారికి పుట్టిన బిడ్డల బాధ్యతలు చూస్తారు. కానీ నేటి రోజుల్లో తల్లిదండ్రుల పట్ల కొంత మంది పిల్లలు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు. తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెల మధ్య బంధం ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తులు,అంతస్థులివ్వలేదని, నగలివ్వలేదని తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గోరు ముద్దలు కొసరి కొసరి తినిపించిన తల్లిదండ్రులకు, వారు మలిదశకు వచ్చే సరికి అన్నం పెట్టడం లేదు. కొంత మంది.. తమను పెంచేందుకు తల్లిదండ్రులు కష్టపడిన తీరును గుర్తు చేసుకుని, వారికి అండగా నిలుస్తుంటారు. బ్రతికుండగానే కాదూ చనిపోయిన తర్వాత కూడా ఆ ప్రేమను పలు రూపాల్లో చాటుకుంటారు.
తమను పెంచి పోషించి, మంచి భవిష్యత్తును అందించిన తల్లిదండ్రుల పట్ల తమకున్న ప్రేమను ప్రదర్శించారు ఆ కుమారులు. బ్రతికుండగా తల్లిదండ్రుల బాగోగులు చూసుకున్న కుమారులు.. చనిపోయిన తర్వాత వారిపై ప్రేమను మరింత చాటుకున్నారు. తల్లిదండ్రుల రూపంలో విగ్రహాలు కట్టించి, పూజలు చేశారు. ఇంతకూ ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందంటే.. తెలంగాణ హన్మకొండ జిల్లాలోని కాజీపేట మండలంలో. దర్గాకాజీ పేట గ్రామానికి చెందిన ఎల్లయ్య, రాధమ్మ దంపతులు. వారికి ముగ్గురు కుమారులు శ్రీనివాసులు, గౌరీశంకర్, రాధా కృష్ణ. అయితే గత ఏడాది ఎల్లయ్య, రాధమ్మ మృతి చెందారు. వీరి మరణాన్ని తట్టుకోలేని కుమారులు.. అమ్మనాన్నల మీద ప్రేమతో వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
చనిపోయిన తల్లిదండ్రులను నిత్యం స్మరించుకునేలా ఓ ఆలోచన చేశారు. తల్లిదండ్రుల సంవత్సరీకాన్ని నిర్వహించాలని భావించిన కుమారులు, బంధు మిత్రులను ఆహ్వానించారు. తల్లిదండ్రులకు విగ్రహాలు చేయించి, ఇంటి దగ్గర ఏర్పాటు చేసి వారి విగ్రహాలకు పూజలు చేశారు.అంతేకాదు ఈ విగ్రహాలను పూజ గదిలో పెట్టుకుని పూజిస్తామని ముగ్గురు కుమారులు చెబుతున్నారు. తల్లిదండ్రుల విగ్రహాలు చేయించి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్న ముగ్గురు కుమారులను బంధువులు, స్థానికులు అభినందిస్తున్నారు. తల్లిదండ్రులు భారమని భావిస్తూ, ఇంట్లో నుండి గెంటేస్తున్న సమాజంలో.. వారి కోసం విగ్రహాలు కట్టి, పూజలు చేస్తున్న ఈ కుమారుల ప్రేమ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.