కొత్తగా పెళ్లైన ప్రతీ స్త్రీ అమ్మతనం కోరుకుంటుంది. అదీకాక అమ్మతనంతోనే స్త్రీకి పరిపూర్ణత్వం కూడా లభిస్తుందనేది అనాదిగా వస్తున్న మాట. తాజాగా అలాంటి అమ్మతనాన్నే కోరుకుంది పెళ్లై నాలుగు నెలలు అవుతున్న ఓ స్త్రీ. కానీ దానికి అడ్డు చెప్పాడు భర్త. కొన్ని రోజుల తర్వాత పిల్లలు కనడం గురించి ఆలోచిద్దాం అని భర్త సర్ది చెప్పుకుంటూ వచ్చాడు. దాంతో మనస్థాపానికి గురైన ఆ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా కలకలం రేకెత్తించిన ఈ సంఘటన బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితె..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోయిన్ పల్లి మలానికాలనీకి చెందిన విజయ్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పాలూరు మండలం నుచూపొద్దు గ్రామానికి చెందిన విజయలక్ష్మి (25)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం బోయిన్ పల్లిలో నివాసం ఉంటున్నారు విజయ్-విజయలక్ష్మి దంపతులు. ఈ క్రమంలోనే విజయ లక్ష్మి తనకు పిల్లలు కావాలని భర్తతో తరచుగా చెప్పేది. కానీ విజయ్ కుమార్ మాత్రం మనం ఇప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అప్పుడే పిల్లలు అంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది కొన్ని రోజుల తర్వాత సంతానం గురించి ఆలోచిద్దాం అని సర్ధి చెబుతూ వచ్చాడు. ఇక ఈ విషయంపై తరచుగా ఇద్దరి మధ్య వాదనలు జరుగుతుండేవి.
ఆ క్రమంలోనే ఈ వాదనలు కాస్త తీవ్ర రూపం దాల్చి గొడవకు దారి తియ్యడంతో.. మనస్థాపానికి గురైంది విజయలక్ష్మి. దాంతో మూడు రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తన ఫోన్ కూడా పనిచేయకపోవడంతో, మూడు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు విజయ్ కుమార్. మెుదట బంధువుల ఇంటికి వెళ్లి ఉంటుంది అని భావించిన అతడు.. చుట్టాలను, సన్నిహితులను చివరికి ఆమె తల్లిదండ్రులను కూడా ఆరా తీశాడు. ఫలితం కనిపించకపోవడంతో.. గురువారం బోయిన్ పల్లి పోలీసులను ఆశ్రయించాడు విజయ్ కుమార్. అతడి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.