ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు ఖాళీ భూములు కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. భూ యజమానులకు తెలియకుండా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి పలువురికి అమ్మేస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారు.
ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూముల ధరలకు రెక్కలు రావడంతో కొంతమంది ఖాళీ భూములు కనిపిస్తే చాలు కబ్జా చేస్తూ జెండాలు పాతేస్తున్నారు. ఫేక్ డాక్యూమెంట్స్ క్రియేట్ చేస్తూ అసలు యజమానులకు చుక్కలు చూపిస్తున్నారు. మరికొంత మంది భూమి సొంతదారులను బెదిరించి తమ హస్తగతం చేసుకుంటుకున్నారు. ఇలాంటి దారుణాలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల అక్రమంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరడా ఝులిపిస్తుంది తెలంగాణ సర్కార్. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్దంగా అక్రమంగా నిర్మించిన బిల్డింగులన కూల్చివేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రంగారెడ్డి జిల్లాలో బుధవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన బిల్డింగులు, విల్లాలను హెచ్ఎండీఏ కూల్చి వేసింది. నిబంధనలు విరుద్దంగా ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన కారణంగా భారీ భవనాలను ఇరిగేషన్ అశికారులు, మణికొండ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారుల ఆధ్వర్యంలో ప్రొక్రెయిన్లతో నేలమట్టం చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో రెండు సార్లు విల్లాలను కూల్చివేసినప్పటికీ బిల్డర్లు మరోసారి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇదే విషయంలో పలుమార్లు బిల్డర్లకు నోటీసులు పంపించినప్పటికీ అవేవీ పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్దంగా అక్రమ విల్లాలన నిర్మిస్తున్నారన్న విషయం తెలుసుకొని అధికారులు కూల్చివేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ భూములకు రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ భూములపై కన్ను వేస్తున్నారు. లీగల్ లేదా ఇల్లీగల్ ఏలాగో అలా భూములను దక్కించుకొని నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ప్రభుత్వ నిబందనలకు విరుద్దంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై ప్రభుత్వం ఇటీవల కొరడా ఝులిపించడం మొదలు పెట్టింది. అయినప్పటికీ బిల్డర్స్ ఇలాంటి నిర్మాణాలు పదే పదే చేపడుతూనే ఉన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ లో ఆరు విల్లాలు కూల్చి వేసినట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.