హిజ్రాలు డబ్బులివ్వకపోతే బట్టలు ఎత్తి చూపించడం గానీ విప్పేయడం గానీ చేస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారో, దీనికి గల కారణమేంటో ఓ హిజ్రా వెల్లడించారు.
హిజ్రా.. ఈ మాట వింటే సామాన్యులకు కడుపు రగిలిపోతుంది. బస్టాపుల్లో, బస్సుల్లో, రైల్వేస్టేషన్లలో, రైళ్లలో, రోడ్ల మీద ఇలా ఎక్కడబడితే అక్కడ ఎదురుపడుతూ డబ్బులివ్వు అంటూ విసిగిస్తుంటారు. డబ్బులిచ్చేవరకూ అక్కడ నుంచి కదలరు. చాలా మందికి ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. జీవితంలో ఏదో ఒక సమయంలో హిజ్రాలు తగలకుండా ఉండరు. డబ్బులు లేవంటే జేబుల్లో చేతులు పెట్టి విసిగిస్తారు. ఒక్కోసారి దౌర్జన్యంగా లాక్కుని వెళ్ళిపోతారు. కాలినడకన నడిచే వాళ్ళని, బైకుల మీద వెళ్లే సామాన్యులని డబ్బులు అడిగి విసిగిస్తుంటారు. కారులో పోయే వాళ్ళని అడగడం మానేసి కాలినడకన పోయే వాళ్ళని అడిగితే ఏమొస్తుంది.. ఆ డబ్బులు లేకే కదా కాలినడకన వెళ్తున్నాం అని చాలా మందికి అనిపిస్తుంది.
ఒక్కోసారి దౌర్జన్యంగా నోటు లాక్కుని పోయే క్రమంలో అది చిరిగిపోతుంది. జేబులో ఎంతుంటే అంతా లాక్కెళ్లిపోతారు. అయితే ఇప్పుడు కాస్త మార్పు వచ్చింది. సమాజంలో చదువుకున్న హిజ్రాలు, కష్టపడి పని చేసే హిజ్రాలు, ఉద్యోగాలు చేసుకుని బతికే హిజ్రాలు, డాక్టర్లు కూడా అయిన వారు ఉన్నారు. అయితే అందరు హిజ్రాలు చెడ్డవారు అని అనలేము. సమాజంలో మంచివారు ఉన్నట్టే చెడ్డవారు ఉన్నారు. అయితే కొంతమంది హిజ్రాలు డబ్బులు అడగడానికి వచ్చినప్పుడు చీర ఎత్తి చూపిస్తుంటారు. కొంతమంది బట్టలు విప్పేస్తుంటారు. బూతులు కూడా తిడుతుంటారు. అసలు బట్టలు ఎత్తి చూపించడానికి, విప్పడానికి కారణం ఏంటి? ఈ పద్ధతి ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయాన్ని ఒక హిజ్రా వెల్లడించారు.
‘హిజ్రాలు ఆడవాళ్ళుగా ఉండరు. తమవి మగ శరీరాలు. చీరలు కట్టుకుని వచ్చినప్పుడు.. మగవాళ్ళు చీరలు కట్టుకున్నారు, చీరలు కట్టుకుని ఎందుకు వస్తున్నారు అని అనుమానం వ్యక్తం చేస్తారు. ఆ తర్వాత భయపడతారు. ఇది అనాదిగా ఉంది. అందుకోసం సర్జరీ చేయించుకుంటాం. ఆ సర్జరీ కోసం 4, 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ డబ్బు తమకు ఎవరూ ఇవ్వరు, ప్రభుత్వాలు పట్టించుకోవు. అలా అప్పు చేసో, దాచుకున్న డబ్బుతో సర్జరీ చేయించుకుంటాం. సక్సెస్ అయితే బతుకుతాం లేదంటే చనిపోతాం. అలాంటి సర్జరీ చేయించుకుని వచ్చి బట్టలు ఎందుకు విప్పుతాము. తాము హిజ్రా అని నిరూపించుకోవడం కోసం, జండర్ ప్రూవ్ చేసుకోవడం కోసం బట్టలు విప్పుతామని హిజ్రా తెలిపారు.
హిజ్రాలు బట్టలు విప్పేంత ఒత్తిడి ఎక్కడ నుంచి వచ్చింది అంటే సమాజం నుంచే అని అన్నారు. సమాజం తమను హీనంగా చూడడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల తాము ఇలా అడుక్కోవాల్సి వస్తుందని అన్నారు. పుట్టుకతో ఎవరూ అడుక్కోవాలని అనుకోరని.. తమకు కూడా డాక్టర్, లాయర్ అవ్వాలన్న కలలు ఉంటాయని.. తమకు ఈ పరిస్థితి కల్పించింది సమాజమే అని అన్నారు. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిజ్రాలు కూడా ఈ సమాజంలో భాగమేనని.. అందరం ఒక కుటుంబం అని.. వారి సమస్యలను కూడా సామాన్య జనాలు, ధనవంతులు అందరూ పట్టించుకోవాలని కోరుతున్నారు. సామాన్యుల మీద చేసే దౌర్జన్యం ఏదో ప్రభుత్వం మీద, రాజకీయ నాయకుల మీద చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతీ మనిషికి తమ జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి, వాటితో పోరాడాలా? లేక హిజ్రాల హక్కుల కోసం పోరాడాలా? ఇక్కడ ఎవరి బతుకు వారిది. ఎవరి కోసం వారే పోరాడుకోవాలి అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటి? హిజ్రాలు తమ ఆత్మాభిమానం కోల్పోయి భిక్షాటన చేయవలసిన పరిస్థితికి కారణం పట్టించుకోని ప్రభుత్వాలదేనా? లేక సమాజానిదా? హిజ్రాలను చులకనగా చూడడం, వారికి పని ఇవ్వకపోవడం వంటి కారణాల వల్లే వారు ఇలా అవుతున్నారా? హిజ్రాల వల్ల సామాన్యులు నలిగిపోవడం లేదా? పబ్లిక్ లో బట్టలు ఎత్తి చూపిస్తూ అందరి ముందు అసభ్యకరంగా ప్రవర్తించటం పద్ధతేనా? హిజ్రాలు వర్సెస్ సామాన్యులు.. ఈ విషయంలో ఎవరిది తప్పు? సమాజం, హిజ్రాలు కలిసి ఒక కుటుంబంలా వారి హక్కుల కోసం పోరాడాలా? దీనికి పరిష్కారం ఏమిటో కామెంట్ చేయండి.