గణేష్ నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను యథావిథిగా కొనసాగించాలని, ఉత్తర్వుల్లో మార్పులేదని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంతృప్తి చెందని పక్షంలో ఛాలెంజ్ చేసుకోమని సూచించింది.
హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ సర్కార్ ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై సోమవారం నాడు విచారణ చేస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. గత కొంత కాలంగా హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహలు, దుర్గామాత విగ్రహల నిమజ్జనం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని… కాలుష్య నివారణ పరిగణలోకి తీసుకొని నిమజ్జనం చేయకూడదని న్యాయవాది వేణుమాధవ్ పిల్ దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. ఒకవేళ నిమజ్జనం చేయాలీ అంటే రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.
హైద్రాబాద్ పోలీసులు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీకి నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ట్యాంక్‌బండ్‌లో వినాయక నిమజ్జనం చేసి కలుషితం చేయాలని చెప్పలేమని పేర్కొంది.. గతంలో ప్రభుత్వం మూడు కౌంటర్‌లు దాఖలు చేసిందని.. కానీ, ఇప్పటివరకు ఇబ్బందులను కోర్టు దృష్టికి తీసుకురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఒక్క మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా అమలు చేయాలని కూడ హైకోర్టు ఆదేశించింది. అన్ని ఇబ్బందులు ప్రభుత్వానికి తెలుసు.. అయినా ఎందుకు మౌనంగా ఉంటుంది అంటూ ప్రభుత్వానికి చురకలు వేసింది హైకోర్టు.