టీఎస్‌పీఎస్‌సీ పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణలో ఎంతటి చర్చనీయాంశమైందో అందరికీ విదితమే. టీఎస్‌పీఎస్‌సీ బోర్డు నుంచే ప్రశ్నపత్రాలు లీక్ కావడమన్నది నిరుద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని చెప్పింది. ఇవి చాలవన్నట్లు టీఎస్‌పీఎస్‌సీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు హైకోర్టుకు సైతం ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
ఇప్పటికే పరీక్షా ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో తలలు పట్టుకుంటున్న టీఎస్‌పీఎస్‌సీ బోర్డుకు మరికొన్ని అక్షింతలు చల్లింది.. తెలంగాణ హైకోర్టు. ఇష్టానుసారం పరీక్ష నిర్వహిస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. జూనియర్ లెక్చరర్( జేఎల్) నియామక పరీక్షకు సంబంధించి హైకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. పేపర్-2 ప్రశ్నాపత్రాన్ని తెలుగులోనూ ఇవ్వాలని స్పష్టం చేసింది. మొదట ఈ పేపర్ ఇంగ్లీషులోనే ఇవ్వాలని కమిషన్ అనుకోగా, ఆ నిర్ణయాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది.
మొత్తం 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకోసం టీఎస్‌పీఎస్‌సీ గతేడాది డిసెంబరు 9న నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించే పరీక్షలకు ప్రశ్నాపత్రాలను ఇంగ్లీషులోనే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన విజయ్‌కుమార్ అనే విద్యార్ధి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. కమిషన్ ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని వ్యాఖ్యానించింది. పేపర్-2 ప్రశ్నాపత్రాన్ని ఇంగ్లీషులో ఇస్తే.. తెలుగు మీడియంలో చదువుకున్న వారు విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉందని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది. అందువల్ల జేఎల్ పేపర్-2 ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్, తెలుగు రెండింటిలో ఇవ్వాలని టీఎస్‌పీఎస్‌సీని ఆదేశించింది. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు మేలు జరగనుంది.
కాగా, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతుంది. 9 మంది నిందితులను సిట్ అధికారులు మూడోరోజు సుదీర్ఘంగా విచారించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక ఇచ్చిన సమాచారం ఆధారంగా… సిట్ అధికారులు మరి కొందరిని విచారణకు పిలిచినట్లు సమాచారం. మరోవైపు.. ఈ పేపర్ లీకేజీ కేసులో ఏ2 నిందితుడుగా ఉన్న రాజశేఖర్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్ ని స్వీకరించడానికి హైకోర్టు నిరాకరించడం గమనార్హం.