ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంట వానలో తడిసి ముద్దతుంటే.. రైతు కళ్లల్లో కన్నీరు ఒలుకుతుంది. లంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష చేపట్టారు. కాగా, ఇంకా వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలతో, మరో వైపు అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు ఓ వైపు.. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంట వానలో తడిసి ముద్దతుంటే.. రైతు కళ్లల్లో కన్నీరు ఒలుకుతుంది. మామిడి, నిమ్మ, మిరప, ఇతర కూరగాయల పంటలు.. ఈ అకాల వర్షాలకు దెబ్బతిన్నాయి. కాగా, తెలంగాణలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ అకాల వర్షాలతో జరిగిన పంట నష్టంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష చేపట్టారు. పంట నష్టంపై అంచనాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అయితే తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టేటట్లు కనిపించడం లేదు.
రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో కొద్దిరోజులుగా వానలు దంచికొట్టనున్నాయి. తూర్పు తెలంగాణకు భారీ వడగళ్ల వాన ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉత్తర దిశ నుంచి తెలంగాణ మధ్య ప్రాంతం వరకు భారీ వడగళ్ల వాన కురిసే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే అయిదు రోజులు పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పలు జిల్లాలో భారీ వానలు కురిశాయి. వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, హనుమకొండ, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో అరగంట నుంచి గంటపాటు వడగళ్లు పడటం, ఈదురుగాలులుతో పలుచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు.