గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండలు మండి పోతున్నాయి. ఉక్కపోత, వేడి గాలులతో జనాలు అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కురుస్తోన్న భారీ వర్షాలకు వాతావరణం చల్లబడింది.
అసలు వాతావరణం ఏంటో అర్థం కాకుండా ఉంది. సీజన్‌తో సంబధం లేకుండా అన్ని కాలాల్లో వరుణ దేవుడు వచ్చి ప్రజలకు హాయ్ చెబుతున్నాడు. ఎండలు మండే సీజన్‌లో.. పాపం వేడికి అల్లాడుతున్నాము అనుకున్నాడో ఏమో.. పొద్దు పొద్దున్నే వచ్చి.. నగరాన్ని పలకరించాడు. వేడితో అల్లాడుతున్న జనాలు కాస్త ఉపశమనం కలిగించడం కోసం భారీ వర్షాలు కురిపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఎండలతో ఉడికి పోతున్న ప్రజలకు ఇది చల్లని కబురు అని చెప్పవచ్చు. ఇక గురువారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుండగా.. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పలుచోట్ల భారీ వర్షాలు మొదలయ్యాయి. నగరమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి.
శుక్రవారం తెల్లవారుజాము నుంచే నగరంలోని మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. వర్షంతో రోడ్లన్నీ తడిసిముద్దయ్యాయి. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందికి గురవుతున్నారు. ఇక గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండి పోతున్నాయి. దాదాపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు ఉక్కబోత, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్రమైన వేడితో జనాలు అల్లాడిపోతున్న సమయంలో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షాలకు నగరంలోని వాతావరణం కాస్త చల్లబడింది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలతో కాస్త ఉపశమనం లభిస్తోంది.
అయితే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని.. హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం రాత్రి విడుదల చేసిన వెదర్ బులిటెన్‌లో పేర్కొంది. నేటి నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రానికి వర్షసూచన జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం నిజామాబాద్‌లోని భీమ్‌గల్‌లో 7 మిల్లీమీటర్లు, మంచిర్యాలలోని భిమినిలో 6.8 మి.మీ, ఆదిలాబాద్‌లోని తంసిలో 2.2 మి.మీ, ఆదిలాబాద్‌లో 2 మి.మీ, ఆదిలాబాద్‌లోని ఉట్నూర్‌లో 2.2 మి.మీ వర్షపాతం నమోదైంది.