గత నెల ఓ వైపు ఎండలు.. మరోవైపు వానలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉరుములు.. మెరుపులతో పాటు వడగండ్ల వానతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.. రైతులకు తీవ్రంగా పంటనష్టం వాటిల్లింది. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.. ఈదురు గాలులతో కూడి వర్షాలు కురుస్తున్నాయి.
ఒక పక్క ఎండకాలం ఎండలు మండిపోతున్నాయి.. అంతలోనే అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణం మారిపోయి వర్షాలు పడుతున్నాయి. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎండలు దంచికొడతాయి. కానీ గత నెల నుంచి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. కొన్నిచోట్ల వడగండ్ల వానలు కురిసాయి. తాజాగా హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
హైదరాబాద్ లో నిన్నటి నుంచి ఒక్కసారే వాతావరణంలో మార్పు సంభవించి వర్ణాలు పడుతున్నాయి. నిన్న మధ్యాహ్నం విపరీతమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. సాయంత్రం మబ్బులు పట్టి.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆకాశం మేఘావృతమైంది. ఈ క్రమంలోనే సికింద్రబాద్ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో సైతం భారీ వర్షం కురియడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసెంబ్లీ సరిసర ప్రాంతంలో సైతం ఈదురు గాలులతో కూడి వర్షం కురుస్తుంది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఉప్పల్, కాచీగూడ, తార్నాక, గోల్నాక, సైదాబాద్, నల్లకుంట, రాంనగర్, నారాయణగూడ, లాలాపేట్, హబ్సీగుడ, నాచారం, మల్లాపూర్, అబీడ్స్, దోమలగూడ, కవాడిగూడ, బాగ్‌లింగంపల్లి, బన్సిలాల్‌పేట, రామ్‌గోపాల్‌పేట్, రాంనగర్, విద్యానగర్ లతో పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ప్రస్తుతం వర్షంలోనే హనుమాన్ శోభాయాత్ర కొనసాగిస్తున్నారు భక్తులు. నగరంలో వర్షం కారణంగా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, నేడు, రేపు కూడా భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అకాల వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.