ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో పలు మార్పులు సంభవిస్తున్నాయి. ఉదయం ఎండలు దంచికొడితే.. సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానలు కురియడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం విపరీతమైన ఎండలు కొడితే.. సాయంత్రం అకస్మాత్తుగా ఈదురు గాలులు, అకాల వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు తోడు.. పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ లో మంగళవారం సాయంత్రం విపరీతమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది… మరికొన్ని చోట్ల పిడుగులు పడ్డాయి. బంజారాహిల్స్, ఫిలిమ్ నగర్, జూబ్లి హిల్స్, మాదాపూర్, బాలా నగర్, కూకట్ పల్లి, అమీర్ పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిండటంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. ఈదురుగాలు కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అయితే ఉదయం నుంచి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలకు భారీ వర్షం కాస్త ఊరటనిచ్చింది. రాబోయే కొద్ది గంటల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అత్యవసరమైతే కానీ బయటకు రావొద్దు అని వాతావరణ శాఖ తెలిపింది.